నారాయణపేట: పొగాకు నెమ్మదిగా చంపే విషం.. దానికి దూరంగా ఉంటే ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యకర సమాజం సాధ్యమవుతుందని జూనియర్ సివిల్ న్యాయమూర్తి అవినాష్ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేటి సమాజాన్ని నిశ్శబ్ధంగా కబళిస్తున్న అతిపెద్ద ఆరోగ్య శత్రువు పొగాకేనని.. యువత వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ప్రతి ఏటా లక్షలాది మంది పొగాకు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని.. పొగాకు వినియోగంతో ఆ వ్యక్తి ఆరోగ్యమే కాదు కుటుంబాల భవిష్యత్‌ను చీకట్లోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిగరెట్, బీడీ, గుట్కా, ఖైనీ, జర్దా వంటి రూపాల్లో తీసుకునే పొగాకు నెమ్మదిగా శరీరాన్ని నాశనం చేస్తూ క్యాన్సర్, గుండెజబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతోందన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పొగాకు రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్న బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని కోరారు. ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన పెంచుకొని సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పేదలకు ఉచిత న్యాయ సాయం అందుబాటులో ఉందని, అవసరమైన వారు 15100 నంబర్‌కు కాల్ చేసి సేవలు పొందవచ్చని లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్ లక్ష్మీపతిగౌడ్ వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్, డా. లక్ష్మీకాంత్, డా. జాంరాజు, ఏఎస్‌ఐ ఆంజనేయులు, సీనియర్ అడ్వొకేట్ రఘువీర్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


