● పీఎం ఉషా స్కీం ద్వారా రూ.100కోట్లు
● రెండు రోజుల కార్యక్రమానికి రానున్న
సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో జూన్ చివరి వారంలో జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు వీసీ జీఎన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీయూకు ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ‘విజన్ ఇండియా 2047 ఇంటిగ్రేటింగ్ సైన్స్ ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్‌మెంట్’ థీమ్‌తో సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని పేర్కొన్నారు. వీరితో పాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెక్రటరీ, ప్రభుత్వ కార్యదర్శులు, కేంద్ర, రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల వైస్‌ఛాన్స్‌లర్లు, అన్ని యూనివర్సిటీలు, కళాశాలల పీఎం ఉషా స్కీం కోఆర్డినేటర్స్ పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. రెండు రోజులపాటు నిర్వహించే కార్యక్రమంలో పలు సెషన్స్‌లో వివిధ అంశాలపై కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇటువంటి కార్యక్రమం దక్షిణ భారత్‌లో నిర్వహించడం మొదటిసారని, గతంలో ఉత్తరభారత్‌లో ఒకసారి నిర్వహించారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలను యూనివర్సిటీలతో కలిసిపోయే విధంగా కార్యక్రమం ఉంటుందని, స్టార్టప్‌లు, వివిధ కంపెనీలు, రీసెర్చ్ స్కాలర్స్‌తో కార్యక్రమలలో భాగంగా స్టాళ్లను ఏర్పాటు చేసి విద్యార్థులతోపాటు అందరికీ వీటిపై అవగాహన పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ సదస్సు కోఆర్డినేటర్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీకి జాతీయస్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవకాశం రావడం గొప్ప విషయమని, కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కేంద్రం రూ.35లక్షలు కేటాయించినట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అధ్యాపకుల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.


