1.31 లక్షల మె.ట.వరి ధాన్యం సేకరణ | - | Sakshi
Sakshi News home page

1.31 లక్షల మె.ట.వరి ధాన్యం సేకరణ

May 29 2026 2:49 AM | Updated on May 29 2026 2:49 AM

నారాయణపేట: జిల్లా లో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయని.. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో వేగంగా కొనుగోళ్లు, చెల్లింపులు చేస్తోందని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక గురువారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 17,148 మంది రైతుల నుంచి 1,31,986 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. మొత్తం విలువ రూ.315.31 కోట్లు కాగా.. ఇప్పటి వరకు 15,986 మంది రైతుల ఖాతాల్లో రూ.262 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. ఇది మొత్తం చెల్లింపుల్లో 83 శాతమని పేర్కొన్నారు. మిగిలిన రైతుల చెల్లింపులు వచ్చే 48 గంటల్లో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ధాన్యం సేకరణ నుంచి తరలింపు వరకు ప్రతి దశను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని.. ఇప్పటి వరకు జిల్లాలో 98 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని.. మిగిలిన ధాన్యా న్ని రెండ్రోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో ధాన్యం తడిసిందని.. అధికారులు వెంటనే స్పందించి ఆ ధాన్యాన్ని బాయిల్డ్‌ రైస్‌మిల్లులకు తరలిస్తున్నారని వివరించారు. రైతులకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

నేడు గర్భిణులు, బాలింతలకు అవగాహన

నారాయణపేట: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల్లో శుక్రవారం ఉదయం 9.40 గంటలకు స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎర్లీ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రాజేందర్‌గౌడ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గర్భిణులు, బాలింతలకు తల్లి, శిశు ఆరోగ్య పరిరక్షణ, సమతుల పోషకాహారం, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శిశువు ఎదుగుదల, ఆరోగ్య సంరక్షణ వంటి కీలక అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా వైద్యసిబ్బంది ఆధ్వర్యంలో గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారని.. మహిళలు ప్రభుత్వ ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, గర్భిణులు, బాలింతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఆర్టీసీ విలీనంతోనే ఉద్యోగ భద్రత

కందనూలు: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతోనే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుందని ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కార్మికులకు నష్టం జరగకుండా ఉండేందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రక్రియను పూర్తిచేయాలని కోరారు. అదే విధంగా 2021 వేతన సవరణలో ఉన్నా తేడాలను సవరించాలని.. విలీన కమిటీలో అన్ని సంఘాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌, రీజియన్‌ కార్యదర్శి వెంకటయ్య, ఉపాధ్యక్షుడు సుమలత, పద్మ, కృష్ణయ్య ఉన్నారు.

ఆశావర్కర్ల సమస్యలపరిష్కారానికి కృషి

కొల్లాపూర్‌: ఆశావర్కర్ల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆశావర్కర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కొల్లాపూర్‌లోని మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశావర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనం చెల్లించడంతో పాటు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, ప్రమాద బీమా, హెల్త్‌ కార్డు సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం మంత్రికి వినతిపత్రం సమర్పించగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శివవర్మ, జ్యోతి, గౌరమ్మ, మాధవి, శివలీల పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement