శత శాతం లక్ష్యం..
విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం
● ఈ ఏడాది నుంచి పకడ్బందీగా
ప్రహరీ క్లబ్‌ల నిర్వహణ
● ప్రత్యేక దృష్టి సారించిన విద్యాశాఖ
● 30వ తేదీలోపు ధ్రువీకరణ పత్రం
సమర్పించాల్సిందే
–8లో u
నారాయణపేట (నారాయణపేట రూరల్): చదువుకొనే చోట మాదక ద్రవ్యాల మహమ్మారిని మొగ్గలోనే తుంచి వేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం నషా ముక్త్ విద్యాలయ పేరుతో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ప్రహరీ క్లబ్‌లు పటిష్ట పరుస్తామని ప్రధానోపాధ్యాయులు, కళాశాలల యజమాన్యాలు ఇకపై ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. రాబోవు విద్యా సంవత్సరానికి శత శాతం అమలు జరపాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇటీవల జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.
ప్రహరీ క్లబ్ అంటే..
చెడు వ్యసనాలకు గురవుతున్న విద్యార్థులను గుర్తించేందుకు పిల్లలతోనే ఏర్పాటు చేసిన సమూహాన్ని ప్రహరీ క్లబ్ అంటారు. ముఖ్యంగా ఈ విద్యార్థులు వారి తరగతిలోని ఇతర విద్యార్థులను గమనిస్తూ వారు ఏదేని చెడు అలవాట్లకు బానిస అవుతున్నట్లు గుర్తిస్తే వెంటనే ఉపాధ్యాయులకు తెలియజేస్తారు. తద్వారా వారిని కౌన్సెలింగ్ ద్వారా మార్చే ప్రయ త్నం చేస్తారు. అప్పటికి మార్పు రాకపోతే తల్లిదండ్రులు, పోలీసుల సహకారంతో సన్మార్గంలో నడి పేందుకు కృషి చేస్తారు. అదేవిధంగా కమిటీ సభ్యు లు వారి వారి గ్రామాల్లో మత్తు పదార్థాలకు సంబంధించిన వివరాలు, అమ్మకాలకు సంబంధించి సమాచారం సేకరించి గోప్యంగా కమిటీ కన్వీనర్కు అందిస్తారు. పోలీసుల సహకారంతో వాటి నిర్మూలనకు కృషి చేస్తారు. పాఠశాలలో, చుట్టు పక్కల డ్రగ్స్, మత్తు పదార్థాల నిర్మూలనకు పనిచేస్తారు.
క్లబ్ నిర్మాణం..
ప్రతి విద్యాలయంలో ఒక క్లబ్ ఏర్పాటు చేయగా కన్వీనర్‌గా ప్రధానోపాధ్యాయుడు, కో–కన్వీనర్లుగా పాఠశాలలోని సీనియర్ ఉపాధ్యాయుడు, పోలీస్ అధికారి, తల్లిదండ్రుల్లో ఒకరు, ప్రతి తరగతి నుంచి ఒక బాలుడు, మరో ఇద్దరు బాలికతో కలిపి సు మారు 14 మందితో కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇందుకుగాను గతేడాది జిల్లా నుంచి ఒక సైన్స్ ఉపా ధ్యాయుడిని ఎంపిక చేసి హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని ప్రతి పాఠశాలలోని కమిటీ సభ్యులకు ఆయన అవగాహన కల్పించారు.
కార్యాచరణ.. బాధ్యతలు
పాఠశాల, కళాశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా ఐఎస్‌ఎంఎస్ పోర్టల్‌లో స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టం సర్వీసెస్ నుంచి డ్రగ్ ఫ్రీ డిక్లరైజేషన్ పత్రం డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా నిరోధించాలి. వాటి జాడలేని పాఠశాల వాతావరణాన్ని రూపొందించాలి. మత్తు అనర్థాలపై పిల్లలకు అవగాహన కల్పి ంచాలి. ఇవన్నీ పాటిస్తూ ధ్రువపత్రాన్ని సంబంధిత ప్రధానోపాధ్యాయుడు తన సంతకంతో తిరిగి అప్‌లోడ్ చేయాలి. కమిటీ ఏర్పాటుచేసి డిక్లరేషన్ సమర్పించేందుకు ఈ నెల 30 వరకు గడువు విధించారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు అన్ని పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటైనట్లు తెలుస్తుంది. కానీ పది శాతం కూడా యాక్టివ్‌గా లేక తూతూమంత్రంగా కమిటీని కాగితంపై ఉంచినట్లు గుర్తించారు. సమయం లేనందున మిగతా అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు, కళాశాలలు వెంటనే కచ్చితమైన కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది.
లాగిన్ సౌకర్యం రాలేదు..
అన్ని విద్యాసంస్థల్లో ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేసి సంబంధిత ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరణను సమర్పించాలని ఇప్పటికే డీఈఓ కార్యాలయం సంబంధిత విద్యాసంస్థలకు సమాచారం అందించింది. కానీ నషా ముక్త్ విద్యాలయాకు సంబంధించిన వెబ్‌సైట్‌లో జిల్లా విద్యాశాఖకు ప్రస్తుతం లాగిన్ సదుపాయం లేదు. క్లబ్ ఏర్పాటు చేయని బడుల వివరాలు అందుబాటులో లేవు. వెంటనే లాగిన్ అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులను కోరినట్లు తెలుస్తోంది. కళాశాలల్లోనూ క్లబ్‌లు ఏర్పాటు చేయించాలని డీఐఈఓ సైతం ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు సూచించారు. అయితే పాఠశాలలో ప్రిన్సిపాల్ ఇవ్వాల్సి ఉండగా, కళాశాలలో ప్రతి విద్యార్థి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేసే విద్యాసంస్థలు
ఉన్నత పాఠశాలలు 88
జూనియర్ కళాశాలలు 19
డిగ్రీ, బీఏడ్ కళాశాలలు 9
మెడికల్ కళాశాల 1
గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్ తదితర అన్ని విద్యాసంస్థల్లో మత్తు నిర్మూలనకు ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు రాగా.. పలుచోట్ల నామమాత్రంగా ఏర్పాటు చేశారు. ఈసారి అలా జరగకుండా అన్ని విద్యా లయాల్లో పకడ్బందీగా కమిటీలను ఏర్పాటు చేయాలని, క్లబ్‌ల బలోపేతానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ప్రధానోపాధ్యాయులు కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించింది. అంతకుముందు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సూచించింది.


