నారాయణపేట: రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్‌ఏలు)ను నియమించుకొని ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమానికి సహకరించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బూత్‌స్థాయి ఏజెంట్లు రాజకీయ పార్టీల అధికారిక ప్రతినిధులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకతను పర్యవేక్షించడంతో పాటు ఇంటింటి సర్వే సమయంలో బూత్‌స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల వివరాల సేకరణలో సహకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరణించిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు మారిన వారు, నకిలీ నమోదులు, ఇంకా నమోదు కాని అర్హులైన ఓటర్లను గుర్తించడంలో బీఎల్‌ఏలు కీలక పాత్ర పోషిస్తారని వివరించారు. అలాగే ఓటరు నమోదు, పేరు తొలగింపు, మార్పుల కోసం దరఖాస్తు ఫారాలను ఎలా పూరించాలో ఓటర్లకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. బీఎల్‌ఏలు బూత్‌స్థాయి అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులతో సమన్వయంగా పని చేయాలని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సవరణ కార్యక్రమాలు, శిక్షణ తరగతులు, సమీక్షలకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ఇప్పటికీ బీఎల్‌ఏలను నియమించని రాజకీయ పార్టీలు వెంటనే నియామకాలు పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రమేష్, సి–సెక్షన్ అధికారి జయసుధ, రాజకీయ పార్టీల నాయకులు సలీం, సాగర్, అబ్దుల్ ఖదీర్, వెంకట్రామారెడ్డి, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.


