కొత్తపల్లి (మద్దూరు): మద్దూరు మండలంలోని ప్రతి గ్రామం, పురపాలికను పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి కోరారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులు, పుర చైర్మన్, కౌన్సిలర్లు, తాజా మాజీ సర్పంచ్‌లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో రహదారి విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పేయే వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే ట్యాంకర్ల ద్వారా అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని 14వ వార్డు కౌన్సిలర్ దినేష్ కోరగా పురపాలికకు వస్తున్న నిధులను ప్రణాళిక ప్రకారం కేటాయించి వినియోగించుకోవాలని కమిషనర్ శ్రీకాంత్‌ను ఆదేశించారు. పలు వార్డుల్లో పారిశుద్ధ్య సమస్య తీవ్రతను తగ్గించుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో బుక్ కీపర్లు ప్రభుత్వ పథకాలను నీరుగార్చేలా పని చేస్తున్నారని పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సింహులు తెలుపగా.. పనిచేయని బుక్ కీపర్లపై చర్యలు తీసుకోవాలని, వినని పక్షంలో తొలగించాలని ఏపీఎం కృష్ణవేణిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామన్న, పుర చైర్‌పర్సన్ దిల్లీకర్ సరస్వతి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, వ్యవసాయ అధికారి ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


