నారాయణపేట: జిల్లా ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లాలోని బాధితులు, ఫిర్యాదుదారులు నేరుగా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి తమ సమస్యలను వివరించారు. మొత్తం 18 మంది ఫోన్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఎక్కువ మంది తమ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు అధికంగా నడుస్తున్నాయని, ఆరుబయట మద్యం తాగుతున్నారని, రాత్రివేళల్లో పెట్రోలింగ్ పెంచాలని, డబ్బులు తీసుకొని మోసం చేస్తున్న ఘటనపై ఫిర్యాదు చేశారు. సమస్యలను ఎస్పీ స్వయంగా నమోదు చేసుకొని సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదు ను పూర్తిస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ..
నారాయణపేటలోని ఎరగ్రుట్ట చెక్‌పోస్టు, దామరగిద్ద మండలం కానుకుర్తి సరిహద్దు చెక్‌పోస్టును సోమవారం అర్ధరాత్రి ఎస్పీ డా. వినీత్ ఆకస్మికంగా సందర్శించారు. వాహన తనిఖీలు, రాత్రిళ్లు భద్రతా చర్యలు, అనుమానాస్పద వ్యక్తుల పరిశీలనతో పాటు పాయింట్ బుక్ నమోదును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లాలోని 7 చెక్‌పోస్టుల వద్ద పోలీసులు, వెటర్నరీ వైద్యులు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించినా సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బక్రీద్‌ను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకొనేలా జిల్లా పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. అక్రమ మద్యం, గంజాయి, పశువుల అక్రమ రవాణా, పేలుడు పదార్థాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.


