నారాయణపేట (దామరగిద్ద): బాల్య వివాహాలు కుటుంబానికే కాదు.. సమాజ భవిష్యత్‌కే ప్రమాదకరమని, ప్రతి బాలిక తన జీవిత లక్ష్యాన్ని సాధించే వరకు చదువు కొనసాగించేలా సమాజం బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం దామరగిద్ద మండలం కంసానన్‌పల్లిలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో ‘బాల్య వివాహ రహిత తెలంగాణ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను గ్రామస్తులకు తెలియజేశారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమాజంలో పేదరికం, మూఢ నమ్మకాలు, సామాజిక ఒత్తిళ్లు, భద్రతపై అపోహలు వంటి కారణాలతో బాల్య వివాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చిన్న వయసులో గర్భధారణతో బాలికల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని.. రక్తహీనత, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి, ప్రసవ సమయంలో ప్రాణాపాయ పరిస్థితులు వంటి సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. బాల్య వివాహాల నిరోధక చట్టం–2006, పోక్సో, బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఎవరైనా బాల్య వివాహాలకు ప్రయత్నిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రతి బాలికకు తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని, తల్లిదండ్రులు కూడా కుమార్తెలను భారం అనుకునే దృక్పథాన్ని మార్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు, మహిళలు, విద్యార్థులతో బాల్య వివాహాలను అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అధికారులు గ్రామస్తులకు చట్టాలపై అవగాహన పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, డీఆర్డీఓ వెంకట్రాములు, డీడబ్ల్యూఓ రాజేందర్‌గౌడ్, సర్పంచ్ సుశీలమ్మ, తహసీల్దార్ తిరుపతయ్య, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ ఉదయ్‌శంకర్, సీడీపీవోలు, అంగన్వాడీ సూపర్‌వైజర్లు, డీసీపీయూ, చైల్డ్‌లైన్ సిబ్బంది పాల్గొన్నారు.


