ఇంధరాఘాతం | - | Sakshi
Sakshi News home page

ఇంధరాఘాతం

May 26 2026 7:54 AM | Updated on May 26 2026 7:54 AM

మహబూబ్‌నగర్‌ రూరల్‌: ఒకపక్క నిత్యావసర ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యుడికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత భారంగా మారుతున్నాయి. చమురు సంస్థలు మరోసారి ఇంధన ధరలను పెంచడంతో ప్రజలపై అదనపు భారం పడింది. కొద్ది రోజులుగా నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలతో ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.68 నుంచి రూ.113.60 చేరగా.. డీజిల్‌ ధర రూ.101.90 పైసలుగా ఉంది. ధరల పెరుగుదలతో వినియోగదారులతోపాటు రైతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుండగా.. వ్యవసాయ రంగంపైనా దాని ప్రభావం పడుతోంది.

డీజిల్‌ వినియోగం ఎక్కువ..

జిల్లాలో 60 కిలోమీటర్ల మేర ఎన్‌హెచ్‌–44 విస్తరించి ఉండడంతో హైదరాబాద్‌, కర్నూలుకు రాకపోకలు సాగించే వాహనాలు ఇక్కడి బంకులపైనే ఆధారపడతాయి. అందుకే డీజిల్‌ వినియోగం ఎ క్కువగా ఉంటుంది. ప్రస్తుతం వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో పెరిగిన ధరలు రైతులకు మరింత భారంగా మారనున్నాయని ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల అన్ని నిత్యావసర వస్తువులపై ప్రభావం చూపుతుందని, తద్వారా ఆ భారం సామాన్యులపై తీవ్రంగా ఉంటుందని సగటు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపు ధరలు.. మరోవైపు అక్రమాలు

ఒకవైపు పెరిగిన పెట్రో ధరలతో వినియోగదారులు తంటాలు పడుతుంటే.. మరోవైపు పెట్రోల్‌ బంకుల్లో అక్రమాల తంతు కొనసాగుతున్నది. వాహనదారు లు మీటర్‌ రీడింగ్‌ చూస్తుండగానే పెట్రోల్‌ పోస్తున్నప్పటికీ ఇందులో తేడాలు ఉన్నట్లు గతంలో పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయి. మీటర్‌ రీడింగ్‌లో మాయ చేస్తున్నారని తెలుస్తుంది. అధికారులు రోజు వారి విధుల్లో భాగంగా పలు పెట్రోల్‌ బంకులను తనిఖీ చేస్తూ బంకుల యజమానుల అక్రమాలకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement