కోస్గి రూరల్/కొత్తపల్లి/మాగనూరు: జిల్లాలో ని గుండుమాల్, కొత్తపల్లి, మద్దూరు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో గుండుమాల్ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు విరిగిపడ్డాయి. చెరువు కట్టపై 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. 4వ వార్డులోని గొల్ల కిష్టయ్య ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
● కొత్తపల్లి మండలం నిడ్జింత శివారు, గ్రామ ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న చెట్లు విరిగిపడ్డాయి. శివారు పొలాల్లో నిర్మించుకున్న కోళ్లఫారం షెడ్ పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు తెగి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
● మాగనూర్ మండలంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభాలు, భారీవృక్షాలు నేలకొరిగాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. ఆదివారం సాయంత్రం ఆరు వరకు విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


