నారాయణపేట: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా కోసం శనివారం సాయంత్రం జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ప్రత్యేక నాకాబంది నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలు చేపట్టారు. 18 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేయడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 211 మంది వాహనదారులకు రూ.1,35,755 జరిమానా విధించినట్లు ఎస్పీ డా. వినీత్ వెల్లడించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, చోరీలు, అక్రమ రవాణా, మత్తు పదార్థాల తరలింపును అరికట్టేందుకు నాకాబంది నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే పోలీస్‌శాఖ ప్రధాన బాధ్యతని.. వాహనదారులు తప్పనిసరిగా వాహనాలకు సంబంధించిన పూర్తి పత్రాలు వెంట ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రజలు పోలీస్‌శాఖకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్‌స్టేషనన్‌లో లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. నాకాబందీలో జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
బక్రీద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలి..
బక్రీద్ పండుగను జిల్లా ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ డా. వినీత్ కోరారు. టీమ్ బక్రీద్ నారాయణపేట ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ‘పరిశుభ్రత పాటించండి.. రోడ్లపై చెత్త వేయవద్దు అనే సందేశంతో రూపొందించిన అవగాహన బ్యానర్లను ఎస్పీ ఆవిష్కరించి మాట్లాడారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజల్లో బాధ్యతాయుత భావన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీమ్ బక్రీద్ సభ్యులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు అబ్దుల్ సలీం, అమీర్‌ుద్దీన్, మహ్మద్ తఖీచాంద్, సర్ఫరాజ్ హుస్సేన్ అన్సారీ, టీమ్ బక్రీద్ సభ్యులు, కన్వీనర్లు ఫారూఖ్ అహ్మద్, అనీస్ గద్వాల్, హఫిజ్ మహ్మద్ తఖీ, నజీర్ షాపూరి తదితరులు పాల్గొన్నారు.


