జూన్‌ 20న జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

జూన్‌ 20న జాతీయ లోక్‌ అదాలత్‌

May 24 2026 1:03 AM | Updated on May 24 2026 1:03 AM

నారాయణపేట: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించి ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా జూన్‌ 20న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నామని.. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు కోరారు. శనివారం కోర్టులో నిర్వహించిన జిల్లా కో–ఆర్డినేషన్‌ కమిటీ సమావేశంలో న్యాయమూర్తులు, పోలీస్‌ అధికారులతో కలిసి లోక్‌ అదాలత్‌ ఏర్పాట్లు, పెండింగ్‌ కేసుల పరిష్కారంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు పెండింగ్‌లో ఉన్న కేసులను ముందస్తుగా గుర్తించి రాజీమార్గంలో పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రమాదాలు, గొడవలు, చీటింగ్‌ కేసులు, వివాహ సంబంధిత వివాదాలు, చిన్నచిన్న దొంగతనం కేసులు, డ్రంకెన్‌ డ్రైవ్‌, కరోనా కాలం నాటి పెండింగ్‌ కేసులను లోక్‌ అదాలత్‌లో పరిష్కరించాలని సూచించారు. అలాగే ఎగ్జిక్యూషన్‌ పిటిషన్లు, క్రిమినల్‌ కాంపౌండబుల్‌ కేసులు, సివిల్‌ వివాదాలు, సైబర్‌క్రైం కేసులు, ఎన్‌ఐ యాక్ట్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎన్‌బీడబ్ల్యూ కేసులు, పెండింగ్‌ చార్జ్‌షీట్లను త్వరగా పూర్తిచేసి అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. లోక్‌ అదాలత్‌ ద్వారా కక్షిదారులు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో న్యాయం పొందే అవకాశం ఉందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజీమార్గంలో 80 నుంచి 95 శాతం వరకు కేసులను పరిష్కరించే లక్ష్యంతో అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి బి.సాయిమనోజ్‌, జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి అవినాష్‌, పోలీస్‌ అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement