బిందు, తుంపర సేద్యం పరికరాల సబ్సిడీలో 10 శాతం కోత
● అన్నదాతలపై అదనపు భారం
● ఉద్యానానికి ఊతమేది..?
నర్వ: రైతులు నీటి కొరతను అధిగమించేందుకు ఆరుతడి పంటలు సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. కూరగాయలు, పొద్దుతిరుగుడు, పండ్ల తోటల్లో సూక్ష్మ సేద్యం పరికరాలను అన్నదాతలు అత్యధికంగా వినియోగస్తున్నారు. ఆయిల్‌పాం సా గును ఇటీవల సర్కారు ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో బిందు, తుంపర సేద్యం పరికరాలకు డి మాండ్ పెరుగుతుండగా.. మరోవైపు ప్రభుత్వం ఇ టీవల రాయితీలో కోత విధించింది. పది శాతం మే ర తగ్గించడంతో రైతులపై ఆర్థిక భారం పడనుంది.
ఆయిల్‌పాంకు తొలి ప్రాధాన్యం..
సర్కారు ఆదేశాలకు అనుగుణంగా ఉద్యాన అధికారులు ఆయిల్‌పాం సాగుకు తొలి ప్రాధాన్యమిచ్చి జిల్లాలో 8 వేల ఎకరాల లక్ష్యం విధించారు. దాని తర్వాతే పండ్ల తోటలు, చివరి దశలో కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలున్నాయి. దీంతో ఉద్యాన పంటలకు రాయితీ అందించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
నీటి ఆదాకు మార్గం..
బిందు, తుంపర పరికరాల వినియోగంతో 43 శా తం నీరు, 33 శాతం విద్యుత్ ఆదా అవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక దిగుబడి సైతం 52 శాతం అదనంగా వస్తుందని పలు సంస్థలు, వ్యవసాయ శాస్త్రవేత్తల సర్వేల ద్వా రా తెలిసింది. ప్రభుత్వం రాయితీలో కోత విధించడంతో సాగునీటి వృథాతో పాటు, విద్యుత్ వినియోగం కూడా పెరగనుందని రైతులంటున్నారు.
సన్న, చిన్నకారు రైతులే అధికం..
జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు అత్యధికంగా ఉన్నారు. అర ఎకరా మొదలు రెండెకరాల వరకు కూరగాయాలు, పప్పుదినుసులు, మొక్కజొన్న తదితర ఆరుతడి పంటలు సాగు చేసుకునేవారు ఎక్కువగా బిందు సేద్యం పరికరాలను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం తగ్గించిన 10 శాతం రాయితీని రైతులే కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మొత్తాన్ని మొదట్లో చెల్లిస్తేనే పరికరాలు అమర్చుతామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నాయి.
4.20 లక్షల ఎకరాల్లో..
జిల్లాలో ఏటా వరి, పత్తి, మొక్కజొన్న పంటలను మూస ధోరణిలో పండిస్తున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 4.20 లక్షలకుపైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో 5 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 58 వేల ఎకరాల్లో పత్తి, 1.90 లక్షల ఎకరాల్లో వరి, 1.80 లక్షల ఎకరాల్లో కంది, 5 వేల ఎకరాల్లో పెసర సాగు కానుంది. చాలామంది రైతులు ఆరుతడి పంటల సాగుకు ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 7,416.93 హెక్టార్లలో 2,326 డ్రిప్, స్ప్రింక్లర్లు వినియోగిస్తూ పంటలు సాగు చేస్తున్నారు.
ఇప్పటి వరకు ప్రభుత్వం రైతులకు ఉద్యానశాఖ ద్వారా ఎస్టీ, ఎస్సీలకు ఉచితంగా, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు అందించేది. ఇకనుంచి ఎస్సీ, ఎస్టీలకు పది శాతం కోత విధించి 90 శాతం, 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూములున్న బీసీ, ఓసీ రైతులకు 90 శాతం ఉండగా.. 80 శాతానికి తగ్గించనుంది. 5 ఎకరాలకు పైగా భూములున్న వారికి 80 శాతం రాయితీ ఇస్తుండగా 70 శాతానికి పరిమితం చేశారు. ఉద్యాన పంటలు సాగుచేసే రైతులు బిందు, తుంపర సేద్యం పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారంతా సొంతంగా ఏర్పాటు చేసుకోవటమా లేక సాగును పక్కనబెట్టి ఇతర పంటల వైపు దృష్టి సారించడమా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ప్రైవేట్‌గా అమర్చుకుంటే జిల్లాలోని రైతులకు బిందు, తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్స్) పరికరాలపై భారం రూ.కోట్లల్లో పడనుంది.


