నారాయణపేట: జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించే జిల్లాస్థాయి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లాస్థాయి కార్యక్రమంలో అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆమె కోరారు.
తడిసిన ధాన్యాన్ని
ప్రభుత్వమే కొనాలి
కోస్గి రూరల్: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కోస్గి రాంలీలా మైదానంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం మరిన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు గన్నీ బ్యాగులు, లారీల కొరత లేకుండా చూడాలన్నారు. తరుగు, తాలు పేరుతో రైతులను దోపిడీకి గురిచేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట పార్టీ నాయకులు వెంకట్ నర్సింహులు, సాయిలు, జనార్దన్, నీలప్ప, హుస్సేనప్ప, బిచ్చప్ప, మధుసూదన్‌రెడ్డి, వెంకటేశ్ ఉన్నారు.
ఉద్యమకారులకు అన్యాయం చేయొద్దు
మక్తల్: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను క్షేత్రస్థాయిలో గుర్తించి.. సంక్షేమ ఫలాలు అందించాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. గురువారం మక్తల్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కేశవరావు నేతృత్వంలో కమిటీ వేయడం హర్షణీయమన్నారు. అయితే ఉన్నతస్థాయి నాయకులను కాకుండా.. అట్టడుగున ఉన్న ఉద్యమకారుల గుర్తింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేయొద్దని కోరారు. కాగా, వచ్చేనెల 21న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద నిర్మించే తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం కార్యక్రమానికి మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల నుంచి పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎండీ రహీం, బోర్ర సురేశ్, బోరెల్లి సురేశ్, మహేశ్, శ్రీనివాస్, కృష్ణ, గాయత్రి ఉన్నారు.


