కోస్గి రూరల్: ప్రజలతో మమేకమై నేరాల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ డా. వినీత్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం కోస్గిలోని పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి రికార్డులు, కేసుల పురోగతిని పరిశీలించారు. పెండింగ్ కేసులు, సిబ్బంది కేటాయింపు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుపుకొని పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల్లో పోలీసుశాఖపై నమ్మకం, భద్రత, భరోసా పెంపొందించేలా వ్యవహరించాలని, డయల్ 100 ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని సూచించారు. మహిళల రక్షణ, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, హాట్‌స్పాట్లను గుర్తించి ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. చోరీల నియంత్రణకు ప్రత్యేక నిఘా ఉంచాలని, రాత్రిళ్లు గస్తీ నిర్వహించాలన్నారు. బక్రీద్ నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని కో రారు. అనంతరం సిబ్బంది మురళీమోహన్, విజయమ్మ, యూనుస్, ఆఖిల్, తసూజ్‌కు రివార్డులు అందజేశారు. ఆయన వెంట డీఎస్పీ మహేష్, సీఐ సైదులు, ఎస్‌ఐ బాలరాజు ఉన్నారు.


