నారాయణపేట: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుకు అధికారులు ప్రాధాన్యం ఇచ్చి.. బాధితులకు భరోసాగా నిలవాలని ఎస్పీ డా.వినీత్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో గౌరవంగా వ్యవహరించి, వారి సమస్యలను శ్రద్ధగా వినాలన్నారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్లలో సమర్పించే ఫిర్యాదులకు సత్వర చర్యలు లభించకపోతే, సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. సర్కిల్ స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత డీఎస్పీ లేదా జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవన్నారు. ప్రజలకు అండగా నిలవడం పోలీస్‌శాఖ ప్రధాన బాధ్యత అని, అందులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టంచేశారు. పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ విధులను నిబద్దతతో నిర్వర్తించాలని ఎస్పీ ఆదేశించారు.


