నారాయణపేట: తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమ వారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు వెంకట్రామిరెడ్డి, బండమీది బలరాం, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శశికళ, జిల్లా కార్యదర్శి శివకుమారి మాట్లాడుతూ.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కనీస వేతనం రూ.26 వేలుగా ప్రకటించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, మే నెలంతా వేసవి సెలవులు ఇవ్వాలని, కేంద్రం తెచ్చిన ఎన్‌ఐపి–2020 చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని, 2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలని, రాష్ట్రంలో ప్రీప్రైమరీ పీఎంశ్రీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్స్‌కు గ్రాట్యుటీ చెల్లించాలనే తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు, మౌలిక వసతులు కల్పించాలన్నారు. అంతకుముందు మున్సిపల్ పార్క్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం ఏఓ శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోషి, జిల్లా నాయకులు నరహరి, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా నాయకులు పుష్ప, జ్యోతి, నారాయణమ్మ, రాధ, విజయలక్ష్మి, హారిక, వనమాల, పద్మ, చంద్రకళ, ఉమామహేశ్వరి, పద్మ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.


