
అతివల ఆర్థికాభివృద్ధి
నర్వ: జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం రుణ లక్ష్యం ఖరారు చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.262.13 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం విధించింది. మహిళల ఆర్థికాభివృద్ధికి బ్యాంకు లింకేజీ రుణాలను సర్కారు ఏటా అందజేస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించడానికి ఐకేపీ అధికారులు సన్నద్ధమవుతున్నారు.
జిల్లాలో 7,072 సంఘాలు..
ప్రస్తుతం జిల్లాలో 7,072 మహిళా సంఘాలు, 91,065 సభ్యులు ఉండగా.. అర్హత కలిగిన సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు ఏర్పాటు చేసే వ్యాపారం ఆధారంగా రుణాలిస్తారు. చాలా మంది మహిళలు కుటీర పరిశ్రమలు, కిరాణం, పిండిగిర్ని, టైలరింగ్, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు తీసుకుంటారు. గతంలో సభ్యులు తీసుకున్న రుణాల్లో వసూలు శాతం సక్రమంగా ఉన్నందున ఈ వార్షిక ఏడాది కూడా బ్యాంకర్లు త్వరగా రుణాలు అందించే అవకాశం ఉంది. గ్రూపు రుణాలే గాకుండా వ్యక్తిగతంగా రూ.5 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. కాగా వారు దేనికి రుణం తీసుకుంటున్నారో వివరించాల్సి ఉంటుంది. వ్యక్తిగత రుణాలకు బృందం సభ్యులు పూచికత్తు ఇవ్వాలి.
ప్రతినెలా వడ్డీ చెల్లిస్తే మేలు..
మహిళా సంఘాల రుణాల వడ్డీని ప్రభుత్వమే ప్రతినెలా బ్యాంకులకు చెల్లిస్తే వారికి ఇబ్బంది ఉండదు. కానీ వడ్డీ డబ్బులు సకాలంలో రాకపోవడంతో సభ్యులే ప్రతి నెలా బ్యాంకులకు చెల్లిస్తున్నారు. కాగా మహిళలు చెల్లించిన వడ్డీని సర్కారు వారి ఖాతాల్లో జమ చే స్తోంది. గతేడాది బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉండగా.. వడ్డీ డ బ్బులను ప్రతి నెలా చెల్లించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.
మాగనూరు, కృష్ణాలో వెనుకబాటు..
2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మహిళా సంఘాలకు ఇచ్చిన వార్షిక రుణ లక్ష్యాన్ని దాదాపు అన్ని మండలాలు పూర్తిచేయగా.. మాగనూర్, కృష్ణా బాగా వెనుకబడ్డాయని అధికారులు పేర్కొన్నారు. గతేడాది రుణ లక్ష్యం రూ.262 కోట్లు చేరుకోగా.. మాగనూర్ 79.66 శాతం, కృష్ణా 74.89 శాతం మాత్రమే పూర్తిచేసి కాస్త వెనుకబడ్డాయి.
మండలం సంఘాలు సభ్యులు లక్ష్యం(రూ.లక్షల్లో..)
మద్దూరు 1,073 14,078 4,031.67
దామరగిద్ద 929 11,628 3,419.19
నారాయణపేట 848 11,287 3,167.85
ఊట్కూర్ 707 9,093 2,662.35
మక్తల్ 651 9,223 2,476.45
మరికల్ 586 6,855 2,080.63
కోస్గి 572 7,679 2,181.76
ధన్వాడ 547 6,678 1,983.55
నర్వ 483 6,217 1,737.14
మాగనూర్ 359 4,445 1,319.57
కృష్ణా 317 3,882 1,197.13
జిల్లాలో మహిళా సంఘాల రుణ లక్ష్యం ఖరారు
2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.262.13 కోట్లు
రూ.లక్ష నుంచి రూ.20 లక్షల
వరకు రుణాలు
మండలాల వారీగా 2025–26 రుణ లక్ష్యం
సద్వినియోగం చేసుకోవాలి..
మహిళా సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఏటా రుణాలు మంజూరు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యాన్ని నిర్దేశించి వందశాతం చేరుకునేలా దిశా నిర్దేశ్యం చేశాం. గతేడాది జిల్లాలో రుణ లక్ష్యం చేరుకున్నాం. వెనుకబడ్డ మండలాలను ముందుకు తీసుకెళ్లేలా అధికారులను సమయాత్తం చేస్తాం.
– మొగులయ్య, డీఆర్డీఓ
సభ్యుల ఎంపిక ఇలా..
కొత్తగా ఏర్పాటు చేసే సంఘాల్లో 18 ఏళ్లు నిండిన వివాహత మహిళలే సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగుల భార్యలకు సంఘాల్లో చోటు ఉండదు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకే ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.

అతివల ఆర్థికాభివృద్ధి

అతివల ఆర్థికాభివృద్ధి