● ఓవర్‌హెడ్ ట్యాంక్ నుంచి
వరిమడికి నీళ్లు
● కుళాయిలకు నీళ్లు రాక
ప్రజలు అవస్థలు
కొలిమిగుండ్ల: అధికారంలో ఉన్నామనే ధైర్యంతో ఏకంగా ఓవర్‌హెడ్ ట్యాంక్ నీళ్లనే తన సొంత పొలానికి మళ్లించుకుంటు టీడీపీ నాయకుడు జలదోపిడీకి పాల్పడుతున్నాడు. కొలిమిగుండ్ల మండలం యర్ర గుడి గ్రామంలోని పశువైద్యశాల సమీపంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను నిర్మించింది. ట్యాంక్ చెంతనే టీడీపీ నాయకుడికి రెండు ఎకరాల భూమి ఉంది. సాధారణంగా వర్షధారం కింద పంటలు సాగు చేసుకునేవాడు. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో తనకు అడ్డు ఎవరు చెబుతారనే ఉద్దేశంతో ఓవర్‌హెడ్ ట్యాంక్ పక్కనే ఉండటంతో వాల్వ్ ఆన్ చేసుకొని వరి పంటకు నీళ్లు కట్టుకుంటున్నాడు. ఎక్కువ భాగం పంటకే నీళ్లు సరిపోవడంతో గ్రామంలోని పలు వీధుల్లో కుళాయిలకు నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముందే వర్షాలు అంతంత మాత్రంగానే కురవడంతో భూగర్భ జలాలు తక్కువగా ఉన్న తరుణంలో ప్రజలకు నీటి సరఫరా అందించే వాటిని పంటకు వాడటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పంటకు నీళ్లు ఉపయోగించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


