నంద్యాల(అర్బన్): దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లయ్య, మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి విమర్శించారు. స్థానిక కార్యాలయంలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు దేవాంతకుడు అధ్యక్షతన జిల్లా స్థాయి నాయకుల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలలకు నష్టం కలిగించే జీవో నం.102ను ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. మాలల సమస్యలపై నవంబర్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ముందు దళితులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామంటూ హామీలు ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. సమావేశంలో నాయకులు మద్దిలేటి, నాగరాజు, అంకన్న, అబ్రహాం, రోజక్క, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


