నెలకు రూ. 2లక్షల ఖర్చు
పోటీలకు సిద్ధంగా ఉన్న కోడె
విజయ
నామంతో
పాణ్యం: బండలాగుడు పందెంలో బీఎస్‌ఎస్‌ఆర్ ఎద్దులు రంగంలోకి దిగితే మొదటి లేదంటే రెండో బహుమతి రావాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల్లో ఇవి తమ ప్రతిభను చూపుతున్నాయి. పాణ్యం మండలం ఎస్. కొత్తూరు గ్రామానికి చెందిన బీరం కుటుంబ సభ్యులు 17 సంవత్సరాలుగా వీటిని పోషిస్తున్నారు. ప్రతి నెలా లక్షల రూపాయలు ఖర్చు వస్తున్నా వెనకడుగు వేయకుండా వీటి బలాన్ని, ఔన్నత్యాన్ని అందరికీ చూపుతున్నారు.
2009 నుంచి ప్రారంభం..
ఎస్. కొత్తూరు గ్రామానికి చెందిన బీరం శేషారెడ్డి, బీరం రాజేశ్వరిలకు ఇద్దరు కుమారులు బీరం సుధాకర్‌రెడ్డి, బీరం సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి ఉన్నారు. ఇటీవలే గ్రామ సర్పంచ్‌గా బీరం రాజేశ్వరి పదవీకాలం ముగిసింది. గ్రామంలో పెద్ద వ్యవసాయ కుటుంబంగా పేరొందిన వీరు పోటీ ఎద్దులను పెంచడం ప్రారంభించారు. తొలుత 2009లో మిడుతూరు మండలం తర్తూరు గ్రామంలో జరిగిన సంతలో పాలపండ్ల సైజు ఎద్దులను రూ. 1.55 లక్షలకు కొనుగోలు చేశారు. అదే సంవత్సరం ఓంకార క్షేత్రంలో జరిగిన పాలపండ్ల సైజు పోటీల్లో ఈ ఎద్దులు పాల్గొని నాలుగో స్థానంలో నిలిచాయి. తర్వాత చింతకుంట్ల జనార్దన్‌రెడ్డి వద్ద ఎద్దులను రూ.2.40 లక్షకు కోనుగోలు చేసి పాలపండ్ల సైజు పోటీలు ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్లేవారు. వెళ్లిన ప్రతి చోటా ఎద్దులు విజయం సాధించేవి. ఈ నేపథ్యంలో 2014 తర్వాత బాపట్ల జిల్లా ముత్తాయిపల్లె గ్రామంలో రూ.8 లక్షలతో వృషభాలను కొనుగోలు నిరంతరంగా బండలాగుడు పోటలకు వెళ్తున్నారు.
రణ రాకతో అన్నీ విజయాలే!
బీఎస్‌ఎస్‌ఆర్ ఎద్దుల్లో రణ విజయానికి మారుపేరుగా మారింది. దీనిని బండిఆత్మకూరు మండలం చలిమెల గ్రామంలో రూ. 5.30 లక్షలతో కొనుగోలు చేశారు. ఈ ఎద్దు వచ్చినప్పటి నుంచి పోటీల్లోకి వెళ్లిన ప్రతిసారీ మొదటి బహుమతి వచ్చేది. ఈ ఎద్దును చూసి ఒంగోలు జాతి పశుపోషకులు ఆశ్చర్యపోయారు. మొత్తం 60 రోజుల్లో 52 పోటీల్లో పాల్గొనగా 52 స్థానాల్లో మొదటిస్థానంలో విజయం సాధించి పెట్టింది. దీనికి అండగా వల్లూరు గ్రామంలోని మరో వృషభాన్ని రూ. 4.40 లక్షలకు కొన్నారు. దానిని గుణగా పిలుస్తున్నారు.
రెండు రోజులకోసారి బ్యాటా!
పందెం ఉన్నా.. లేకున్నా.. రెండు రోజులకోసారి (బ్యాటా) వేస్తారు. పాలపండ్ల ఎద్దులకు 18 నిమిషాలు, క్యాటగిరీ వృషభాలకు 25 నిమిషాలు కేటాయిస్తారు. ఎద్దు నడక, దాని ఆహార్యం, బండలాగేటప్పుడు వేసే అడుగులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. శిక్షణ సమయంలో ఏడుగురు వీటి వెంట తిరుగుతారు. గత కొన్నేళ్లుగా బండిఆత్మకూరు మండలం ఏ కోడూరుకు చెందిన చాటంటి నాగేశ్వరరెడ్డి సారథిగా(డ్రైవర్‌గా) వ్యవహరిస్తున్నారు. శిక్షణలోనైనా, పందెంలోనైనా ఆయన తప్పనిసరిగా ఉంటారు. ప్రతీ ఏడాది 80 నుంచి 100 పోటీల్లో ఎద్దులు పాల్గొంటున్నాయి.
ఒంగోలు జాతి గుర్తింపు ఇలా..
ఒంగోలు జాతి ఎద్దులను కొనే వారు ఆనవాళ్లను పరిశీలిస్తారు.
మోకాలు వద్ద నలుపు ఉందో లేదో చూస్తారు.
పేడ వేసే వద్ద నలుపు కనిపించాలి.
నాలుక, ముక్కు వద్ద నలుపు పరిశీలిస్తారు.
నడక, మోపు చూసిన తర్వాతే ఒంగోలు జాతి అని నిర్ధారణకు వస్తారు.
ఇతర రాష్ట్రాల్లోనూ జయకేతనం
ఎస్. కొత్తూరు బీఎస్‌ఎస్‌ఆర్ ఎద్దులు ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటకలోనూ విజయం సాధిస్తున్నాయి. కర్ణాటకలో ప్రతి ఏరువాక పౌర్ణమి రోజు నిర్వహించే బండలాగుడు పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలుస్తున్నాయి. కృష్ణాజిల్లా గుడివాడ, విజయనగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోటీలో పాల్గొని పేరు గడించాయి.
రాష్ట్రస్థాయిలో బీఎస్‌ఎస్‌ఆర్ ఎద్దులకు
ప్రత్యేక గుర్తింపు
బండలాగుడు పోటీల్లో వీటిదే విజయం
ఎస్. కొత్తూరులో
నాలుగు జతల వృషభాలు
వీటి పోషణకు ప్రతి నెలా రూ.లక్ష ఖర్చు
అనుభవం కలిగిన సారథితో తర్ఫీదు


