● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
బేతంచెర్ల: టీడీపీ పాలనలో ఆ పార్టీ నాయకుల అవినీతి తప్ప అభివృద్ధే లేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. బేతంచెర్లలో పార్టీ కార్యాలయంలో శనివారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో బుగ్గన మాట్లాడుతూ.. ప్రతి రంగాన్ని టీడీపీ నాయకులు అవినీతిమయం చేశారన్నారు. గ్రామగ్రామనా బెల్ట్‌షాపులు ఏర్పాటు చేశారన్నారు. ఇసుక, ఇనుపఖనిజం, మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయని ఆరోపించారు. కనీసం మండలంలో స్థానిక గ్రామాల పేర్లు కూడా చెప్పలేని బయటి ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు అక్రమ మైనింగ్ తెగబడుతున్నారని మండి పడ్డారు. పట్టపగలే గూటుపల్లె గ్రామ సమీపాన ఇనుప ఖనిజం తవ్వకాలు సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడమే కాకుండా, జూదం ఆడిస్తూ పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఆలయ ఆదాయాన్ని కోట్లలోకి తీసుకెళ్తే నేడు సరైన పర్యవేక్షణ లేక ఆదాయం పూర్తిగా పడిపోతోందన్నారు.
ముస్లింలపై చార్జీల భారం
బేతంచెర్లలో ముస్లింల కోసం గతంలో నిర్మించిన షాదీఖానాలో చార్జీలను భారీగా పెంచారన్నారు. షాదీఖానాను టీడీపీ నాయకులు ఏమైనా నిర్మించారా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు చెప్పినట్లు అధికారులు నడుచుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పూర్తయిన ఐటీఐ, ఎంఎస్‌ఎంఈ భవనాలను ఇంత వరకు ప్రారంభించలేదన్నారు. పాలిటెక్నిక్ కళాశాల పనులను సైతం పట్టించుకోవడం లేదన్నారు. సీతారామాపురం, శంకరాపురం, ఎంబాయి, కనుమకింది కొట్టాల రహదారి పనులు రెండున్నరేళ్లుగా నిలిచిపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు.
ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుదాం..
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో టీడీపీ నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా గడపగడపకు వెళ్లి చంద్రబాబు ప్రభుత్వ మోసాలను వివరించాలన్నారు. వైఎస్సార్‌సీపీ గుర్తింపు కార్డు ఉన్న కార్యకర్త ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర పంచాయతీ మాజీ చైర్మన్ చలంరెడ్డి, మాజీ ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, వార్డు కౌన్సిలర్ చింతల నాగిరెడ్డి, వివిధ కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు మూర్తుజావలీ, బాబురెడ్డి, ఖాజా హుసేన్, నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, లక్ష్మిరెడ్డి, మురళీకృష్ణ, దస్తగిరి, భాస్కర్ రెడ్డి, శేఖర్, ఖాజా, సలీం, శాలిబేగ్, తిరుమలేశ్వర్ రెడ్డి, పిట్టల జాకీర్ పాల్గొన్నారు.


