శ్రీశైలంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో భక్తుల రద్దీ

Oct 4 2026 9:31 AM | Updated on Oct 4 2026 9:31 AM

రమణీయం.. స్వర్ణరథోత్సవం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులు తీరారు. శనివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్న దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. దీంతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. క్యూకంపార్ట్‌మెంట్లలో భక్తులకు పాలు, తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణీ చేశారు.

శ్రీశైలంటెంపుల్‌: ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేశారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు స్వర్థరథోత్సవం ప్రారంభమైంది. ఉత్సవంలో కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు ఏర్పాటు చేశారు. స్వర్ణరథోత్సవంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఆలయ ఏఈవో వెంకటేశ్వరరావు, అర్చకులు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

రేపటి నుంచి ఎస్‌ఏ–2 పరీక్షలు

నంద్యాల(న్యూటౌన్‌): జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి స్వీయ మూల్యాంకన నమూనా పేపర్‌–2 (ఎఫ్‌–2) పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్‌రెడ్డి శనివారం షెడ్యూల్‌ జారీ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ నెల 5న ఉదయం తెలుగు, మధ్యాహ్నం గణితం, 6న ఉదయం ఇంగ్లిష్‌, మధ్యాహ్నం పర్యావరణ శాస్త్రం, 7న ఉదయం ఓఎస్‌ఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 10.45 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షలు 1.15 నుంచి 2.30 గంటల వరకు జరుగుతాయి. హైస్కూళ్లలో విద్యార్థులకు 5న తెలుగు, గణితం, 6న హిందీ, సాధారణశాస్త్రం, భౌతిక శాస్త్రం, 7న ఇంగ్లిష్‌, సామాజిక శాస్త్రం పరీక్షలు నిర్వహిస్తారు. 8న జీవశాస్త్రం, ఓఎస్‌ఎస్సీ పరీక్షలు ఉంటాయి. 6, 7, 8 తరగతులకు ఉదయం 9.30 నుంచి 10.45 గంటల వరకు, 11 నుంచి 12.15 గంటల వరకు, మధ్యాహ్నం 1.15 నుంచి 2.30 గంటల వరకు, 2.45 నుంచి 4 గంటల వరకు పరీక్షలు నిర్వహించేలా సమయాలను నిర్ణయించారు. 9, 10 తరగతులకు కూడా ఆయా సబ్జెక్టుల వారీగా సమయాలను కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement