● కర్నూలు మార్కెట్ యార్డుకు భారీగా తగ్గిన వ్యవసాయ ఉత్పత్తులు
కర్నూలు(అగ్రికల్చర్): కరువు ప్రభావం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుపై స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబరు నెలలో మార్కెట్ వ్యవసాయ ఉత్పత్తులు రావడం గణనీయంగా తగ్గిపోయింది. ఇందుకు ఎల్‌నినో కారణంగా ఉత్పన్నమైన కరువు పరిస్థితులే. మామూలుగా అయితే మార్కెట్ యార్డులు ఆగస్టు రెండో పక్షం నుంచి వ్యవసాయ ఉత్పత్తులతో కిటకిటలాడుతాయి. ఉల్లి గడ్డలకు పాత, కొత్త మార్కెట్‌లు కూడా సరిపోయేవి కావు. ఈ సారి మాత్రం మార్కెట్ యార్డులోని రోడ్లు, షెడ్లు వెలవెలబోతున్నాయి. గతేడాది సెప్టెంబరు నెలలో మార్కెట్‌కు అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు 1,78,382 క్వింటాళ్లు వచ్చాయి. ఈ సారి సెప్టెంబరు నెలలో 47,638 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి సెప్టెంబరులో 1,30,744 క్వింటాళ్లు తగ్గాయి. వచ్చిన ఉత్పత్తుల క్రయవిక్రయాలు మధ్యాహ్నానికే పూర్తవుతుండటంతో మార్కెట్ ఖాళీగా కనిపిస్తోంది. ఉల్లిగడ్డలతో సహా వేరుశనగ, ఆముదం, వాము, మొక్కజొన్న, సజ్జ, మినుములు తదితర పంటలు తూతూమంత్రంగా వస్తున్నాయి. మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడంతో ఒకశాతం ఫీజు ద్వారా వచ్చే ఆదాయం కూడ పడిపోతోంది. మార్కెట్ కమిటీలకు వచ్చే ఆదాయాన్ని బట్టి సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి. ఆదాయం పడిపోతుండటంతో సంక్షేమ కార్యక్రమాలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది.


