కేసీ కాల్వకు తగ్గిన నీటిసరఫరా | - | Sakshi
Sakshi News home page

కేసీ కాల్వకు తగ్గిన నీటిసరఫరా

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

జూపాడుబంగ్లా: ఎగువ ప్రాంతాల నుంచి సుంకేసుల డ్యాంలోకి వరదనీటి ప్రవాహం నిలిచిపోవడంతో కేసీ కాల్వకు నీటి సరఫరాను తగ్గించినట్లు కేసీకాల్వ ఏఈ శ్రీనివాసనాయక్‌ తెలిపారు. ప్రస్తుతం సుంకేసుల డ్యాం నుంచి కేసీ కాల్వకు 300 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల అవుతున్నాయన్నారు. లాకిన్స్‌లా నుంచి తూడిచెర్ల సబ్‌ చానల్‌ కాల్వకు 130 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జూపాడుబంగ్లా వద్ద క్రాస్‌రెగ్యులేటర్‌ గేట్లు మూసివేసి కాల్వలో నిలిచిన నీటిని భాస్కరాపురం వద్దనున్న పంప్‌హౌస్‌ ద్వారా సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులకు నీటిని పంపింగ్‌ చేయనున్నట్లు ఏఈ తెలిపారు. మళ్లీ కేసీ కాల్వకు నీటిసరఫరా విషయం ఉన్నతాధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు.

ఆత్మకూరు డీడీపీటీగా వెంకట శ్రీకాంత్‌

ఆత్మకూరురూరల్‌: నాగార్జునసాగర్‌ –శ్రీశైలం పులుల అభయారణ్యంలోని ఆత్మకూరు డివిజన్‌కు డిప్యూటీ డైరెక్టర్‌ ప్రాజెక్ట్‌ టైగర్‌గా వెంకట శ్రీకాంత్‌ను నియమించింది. ఈయన 2023లో జరిగిన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో ఐఎఫ్‌ఎస్‌ విభాగంలో టాపర్‌గా నిలిచారు. ఇక్కడ డీడీపీటీగా పని చేసిన విగ్నేష్‌ అపావ్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు మారడంతో ఆయన స్థానంలో శ్రీకాంత్‌ను నియమించారు. వెంకట శ్రీకాంత్‌ ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సబ్‌ డీఎఫ్‌ఓగా పనిచేస్తున్నారు. ఎన్‌ఎస్‌టీఆర్‌లో జరుగుతున్న అసహజ పులి మరణాల ఘటనల నేపథ్యంలో సమర్థవంతమైన అధికారిని ఆత్మకూరుకు వస్తుండటం కేసుల దర్యాప్తు వేగవంతమవుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నామమాత్రంగాఇంటింటికీ పింఛన్ల పంపిణీ

నంద్యాల(న్యూటౌన్‌): ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జిల్లాలో నామమాత్రంగా జరిగింది. గురువారం జిల్లాలో చేపట్టిన జిల్లాలో ఎన్‌టీఆర్‌ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ 93 శాతం పూర్తయింది. పింఛన్ల పంపిణీని డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి పర్యవేక్షించారు. జిల్లాలో 2.09 లక్షల పింఛన్లకు గాను 1.95 లక్షల పింఛన్లు పంపిణీ చేశారు. కొత్త పింఛన్లు మంజూరు కాలేదని చెప్పడంతో నిరాశతో దరఖాస్తుదారులు నిరాశ చెందారు.

పచ్చని నారు

పశువులకు మేత

రుద్రవరం: ఖరీఫ్‌ను కరువు మింగేసింది. ఎంతో ఆశగా సాగు చేసిన పంటలు మొలక దశలోనే రైతులు వదిలేసుకోవాల్సి వచ్చింది. చెరువులు, తెలుగుంగ కాల్వలకు నీరు రాకపోవడంతో బోర్లు సైతం ఎండిపోయి సాగు కష్టంగా మారింది. ఎంతో మంది రైతులు వరి నార్లు వేసుకుని చివరకు మడుల్లోనే వదలేశారు. బి.నాగిరెడ్డిపల్లె చెరువు కింద వరి నాట్లు వేసేందుకు ఆ గ్రామానికి చెందిన ఓ రైతు మడిలో నారు పెంచారు. అయితే వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో చేసేదేమి లేక పశువులకు మేతగా వదిలేశాడు. ఇలా ఎంతో మంది రైతులు పెట్టుబడి పెట్టి నష్టపోయి అప్పులపాలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement