● నాలుగు రోజులుగా నాణ్యత లేని
భోజనం వడ్డింపు
● హాస్టల్‌ను సందర్శించిన
ఫుడ్ సేఫ్టీ అధికారులు
కర్నూలు సిటీ: జొహరాపురం రోడ్డులోని వేదాంత్ లెర్నింగ్ సెంటర్ పేరుతో నిర్వహిస్తున్న కాలేజీ హాస్టల్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆ కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. వాస్తవానికి వేదాంత్ లెర్నింగ్ సెంటర్ పేరుతో ఉన్న కాలేజీకి గత 29వ తేదీ వరకు ఎలాంటి అనుమతులు లేవు. అనుమతులు లేకుండా కాలేజీ భవనంలోనే హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. అయితే గత నెల 29వ తేదీన డోన్‌లోని నవోదయ జూనియర్ కాలేజీ పేరుతో ఉన్న కాలేజీగా పేరును మార్చుతూ అనుమతులు జారీ చేశారు. కాలేజీకి మాత్రం ఎలాంటి అనుమతులు లేవు. హాస్టల్‌లో సుమారు 88 మంది విద్యార్థుల వరకు ఉన్నారు. ఈ విద్యార్థులకు టిఫిన్, భోజనాన్ని అందించేందుకు ఓ వెండర్‌కు అప్పగించారు. మొదట్లో భోజనం బాగానే ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో నాణ్యత లేని వస్తువులతో తయారు చేసిన వడ్డిస్తున్నారు. ఈ భోజనాన్ని విద్యార్థులు తినేందుకు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకపోయారు. అయినా ఏ మాత్రం మార్పు రాకపోవడంతో నాలుగు రోజుల నుంచి కడుపునొప్పితో రోజుకు ముగ్గురు, నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురై సమీపంలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఫుడ్‌సేఫ్టీ అఽధికారులు కాలేజీ హాస్టల్‌ను సందర్శించి భోజనం నాణ్యతపై విద్యార్థులను విచారించారు. ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు కాలేజీ ఎదుట నిరసన తెలిపారు. నాణ్యత లేని భోజనం తిని 15 మంది విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారని, కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు రంగస్వామి, నాగరాజు, అభిషేక్, వీరాంజనేయులు, మునిస్వామి, శివ, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఐఓకు పిర్యాదు
వేదాంత్ కాలేజీలో చోటు చేసుకున్న సంంఘటనపై విచారించిచర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఇంటర్మీడియేట్ బోర్డు ఆర్‌ఐఓ జి.లాలెప్పకు ఫిర్యాదు చేశారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే నాణ్యత లేని భోజనం తిని విద్యార్థులు అనారోగ్యం బారీన పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పిర్యాదు చేసిన వారిలో ఆ సంఘం జిల్లా అద్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, రంగప్ప తదితరులు పాల్గొన్నారు.


