● అందుబాటులోకి
వెలుగోడు జంగిల్ సఫారి
ఆత్మకూరురూరల్: ఎన్‌ఎస్‌టీఆర్‌లో మూడునెలల పాటు మూసివేసిన ఎకో – టూరిజం గురువారం పునఃప్రారంభమైంది. వర్ష రుతు కాలం వన్యప్రాణులన్నింటికీ పునరుత్పత్తి అనుకూల వాతావరణ కావడంతో ఆ సమయంలో అడవుల్లో అలజడి ఉండరాదని అటవీ శాఖ జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 తేదీ వరకు వరకు ఎకో – టూరిజంకు విరామం కల్పించింది. మూడు నెలలు ముగియడంతో గురువారం ఉంచి ఎకో – టూరిజం రిసార్ట్‌లు పర్యాటకలకు అందుబాటులోకి వచ్చాయి. ఆత్మకూరు అటవీ డివిజన్‌లో కొత్తగా వెలుగోడు రేంజ్ పరిధిలో మరో జంగిల్ సఫారిని ఏర్పాటు చేశారు. వైఎస్సార్ స్మృతివనం నుంచి సఫారి వాహనాలు ఆరు కి.మీ ప్రయాణించి వెలుగోడు బాలెన్సింగ్ రిజర్వాయర్ వెనకతట్టు జలాల వరకు ప్రయాణించి తిరిగి వస్తాయి. ఈ మార్గంలో కృష్ణజింక, చుక్కల దుప్పులు, నీల్‌గాయ్ వంటి గడ్డితినే జంతువులతో పాటు ఎలుగుబంటి, పెద్దపులి, చిరుత పులి కార్నివోర్స్ (మాంసాహార) కనిపిస్తాయి. అంతే కాకుండా పక్షులకు కూడా ఈ ప్రాంతం ఆవాసంగా ఉంటోంది. ఇటీవల సత్యసాయి జిల్లా నుంచి తీసుకు వచ్చిన జింకలను కూడా ఈ ప్రాంతంలోనే వదలడం వల్ల అవి కొంత మానవ ఉనికికి అలవాటైనందున అవి సఫారి వాహనానికి దగ్గరగా నిలబడి పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ వాహనంలో అటవీ శాఖ ఒక శిక్షణ పొందిన గైడ్‌ను కూడా నియమించింది. వెలుగోడు బాలెన్సింగ్ రిజర్వాయర్ ఒడ్డున నిర్మించిన వాచ్ టవర్ నుంచి విశాలమైన అడవిని విహంగ దృష్టితో చూడటానికి అవకాశం ఉంది. సఫారి ట్రిప్‌కు అటవీ శాఖ రూ.2 వేలు రుసుంగా నిర్ణయించింది.


