● అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు
బేతంచెర్ల: గూటుపల్లె పరిసర ప్రాంతంలోని అక్రమ మైనింగ్ జరిగిన ప్రాంతాన్ని డోన్ ఆర్డీఓ నరసింహులు, నంద్యాల జిల్లా మైన్స్ ఏడీ వేణుగోపాల్, తహసీల్దార్ నాగమణి బుధవారం పరిశీలించారు. ఈ ప్రాంతంలో సోమవారం సీజ్ చేసిన వాహనాలు ఎక్కడికి తరలించారో ఆరా తీశారు. సోమవారం అక్రమంగా తవ్వి నిల్వ ఉంచిన 710 టన్నుల ఇనుప ఖనిజం తోపాటు హిటాచి, రెండు టిప్పర్లు, ఒక క్యాంపర్ వాహనాన్ని సీజ్ చేశారు. క్యాంపర్ వాహనం ఒక్కటి పోలీస్‌స్టేషన్‌ల్లో ఉంది. అదే రోజు అర్ధరాత్రి సీజ్ చేసిన రెండు టిప్పర్లను, హిటాచి వాహనాలను మైనింగ్ ప్రాంతం నుంచి తరలించినట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని వెళ్లగా సీజ్ చేసిన వాహనాలు కనిపించకపోవడం చర్చనీయాశంగా మారింది. అధికార పార్టీ నాయకులు కావడంతో తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకున్నారో ఏమో సీజ్ చేసిన వాహనాలను తరలించారు. వాహనాల కోసం రెవెన్యూ, మైనింగ్ అధికారులు రెండు రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. ఈ సందర్భంగా ఆర్డీఓ నరసింహులు, మైన్స్ ఏడీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. సీజ్ చేసిన వాహనాలను తప్పనిసరిగా గుర్తించి, బాధ్యులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమైనింగ్ వాహనాలకు లీజ్ మైన్స్ వారు ఏవిధంగా అనుమతి ఇస్తున్నారని, వారికి నోటీసులు ఇస్తామన్నారు. సీజ్ చేసిన వాహనాలు అదృశ్యం అవ్వడంపై వీఆర్వో రఫీని ప్రశ్నించగా.. తహసీల్దార్‌కు సమాచారం తెలిపి, పోలీస్ స్టేషన్‌ల్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.


