● నేటి నుంచి మొదలు కానున్న రబీ సీజన్ ● కర్నూలు జిల్లాలో 1.07 లక్షలు, నంద్యాల జిల్లాలో 1.93 లక్షల హెక్టార్లలో పంటల సాగుకు అవకాశం ● చలిని మింగేస్తున్న వేడిగాలులు ● పగటి ఉష్ణోగ్రతలు 37–38 డిగ్రీలు నమోదు
కర్నూలు(అగ్రికల్చర్): ఎల్‌నినో దెబ్బకు ఖరీఫ్ పంటలు కుదేలయ్యాయి. ఈ స్థితిలో అక్టోబరు 1 నుంచి రబీ సీజన్ మొదలవుతోంది. ఎల్‌నినో దెబ్బకు కుదేలైన అన్నదాతలు రబీ సాగుపై డోలయామానంలో పడిపోయారు. విత్తనం వేసుకోవడానికి వర్షాలు పడుతాయా?.. వర్షాలు పడి విత్తనం వేసుకుంటే చలి ఉంటుందా?.. చలి లేకపోతే శనగ పంట రాదు కదా అనే మీమాంసలో ఉండిపోయారు. ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాల్లో ఏడారి పరిస్థితులు నెలకొన్నాయి. రబీలో ప్రధాన పంట పప్పు శనగ. కర్నూలు జిల్లాలో రబీ సాధారణ సాగు 1,07,475 హెక్టార్లు ఉండగా, నంద్యాల జిల్లాలో రబీ సాధారణ సాగు 1,93,935 హెక్టార్లు ఉంది. శనగ 59,881 హెక్టార్లలో సాగవుతుంది. పప్పు శనగకు ప్రధానంగా చలి, మంచు అవసరం. చలి, మంచు ఎంత ఎక్కువగా ఉంటే శనగ అంత బాగా వస్తుంది. జూన్ నుంచి వానాకాలం మొదలైనప్పటికీ వాతావరణం ఎండాకాలం మాదిరిగానే ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సెప్టెంబరులో 39–40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎల్‌నినో ప్రబావం వల్ల చలికాలంలో కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చలికాలంలో కూడా పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు. రాత్రి ఉష్ణోగ్రతలు 20–22 డిగ్రీల వరకు వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. గతేడాది చలికాలంలో పగటి ఉష్ణోగ్రతలు 33–34 డిగ్రీల వరకు రాత్రి ఉష్ణోగ్రతలు 9 నుంచి 16 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాల్లో రబీలో శనగ ప్రధాన పంట. శనగ పంటపై ఎల్‌నినో ప్రభావం తీవ్రస్థాయిలో ఉండే ప్రమాదం ఏర్పడింది. ఎల్‌నినో ప్రభావం వల్ల చలికాలంలో అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని, శనగ సాగు చేసే రైతులు వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ముందుకెల్లాలని సూచిస్తున్నారు.
నంద్యాల జిల్లాలో రబీలో ఆయకట్టు లేనట్లే
నంద్యాల జిల్లాలో రబీ సీజన్‌లో వర్షాధారం కింద 84,265 హెక్టార్లు, నీటి ఆధారం కింద 1,09,670 హెక్టార్లలో పంటలు సాగవుతాయి. రబీలో నీటి ఆధారం కింద వరితో పాటు ఆరుతడి పంటలుగా మినుము, మొక్కజొన్న, జొన్న తదితర పంటలు సాగు చేస్తారు. శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి మట్టం కనిష్టస్థాయికి పడిపోయింది. ఇక వర్షాలు కురిసే అవకాశం లేనందున నీటి ఆధారం కింద పంటలు సాగు చేసే అవకాశమే లేదని అధికార వర్షాలు తెలిపాయి.
రబీ సాగు ప్రశ్నార్థకమే !
కర్నూలు జిల్లాలో రబీలో ప్రధానంగా పప్పు శనగ 57,323 హెక్టార్లు, మొక్కజొన్న 13,900, జొన్న 10,597, వేరుశనగ 13,555, పొగాకు 3758 హెక్టార్ల ప్రకారం సాగవుతాయి. ఈ పంటలన్నీ వర్షాధారం కిందనే సాగు చేస్తారు. వరి సాధారణ సాగు 3,817 హెక్టార్లు ఉంది. ఎల్‌ఎల్‌సీ కింద వరి సాగు చేస్తారు. కాల్వలకు నీళ్లు వచ్చే అవకాశమే లేనందున వరి సాగు లేనట్లేనని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన పంటల సాగుకు వర్షాలు, మంచు, చలి అవసరమవుతాయి. ఎల్‌నినో వీటిని మింగేస్తోంది. దీంతో అన్నదాతల పరిస్థితి దయనీయం అయ్యింది.


