ప్రభుత్వ భవనం దర్జాగా కబ్జా! | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భవనం దర్జాగా కబ్జా!

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

పగిడ్యాల: ప్రజల సేవార్థమై లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ భవనాలు అన్యాక్రాంతమవుతున్నాయి. మండలంలోని పునరావాస గ్రామాల్లో ప్రపంచ బ్యాంకు నిధులతో కమ్యూనిటీ హాల్‌, పాల డెయిరీ, అంగన్‌వాడీ సెంటర్లు, హెల్త్‌ సెంటర్లు, సెరికల్చర్‌ భవనం, కుట్టు మిషన్‌ సెంటర్లు, మహిళా భవనం తదితర వాటిని నిర్మించారు. ఈ భవనాలపై గ్రామ పంచాయతీల అధికారుల పర్యవేక్షణ లేక కబ్జాకు గురవుతున్నాయి. అందుకు నెహ్రూ నగర్‌లోని డెయిరీ భవనం అద్దం పడుతోంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి డెయిరీ భవనాన్ని ఆక్రమించుకుని ఇంటి నిర్మాణాన్ని విస్తరించి లెట్రిన్‌, బాత్‌రూం, మెట్లు, అదనపు గదిని నిర్మిస్తున్నా సంబంధిత పంచాయతీ అధికారులు పట్టించుకోకపోగా దానికి ఇంటి పన్ను రశీదు, కుళాయి కనెక్షన్‌ ఇచ్చి ఉదాసీనత కనబర్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ నాయకుల అభయం కబ్జారాయుడుకి లభించినట్లు సమాచారం. ఈ ఆక్రమణపై గతంలో స్థానికులు జిల్లా కలెక్టర్‌కు, మండల తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీడీఓ సుమిత్రమ్మ తనిఖీ చేసి అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆ భవనానికి శెట్టి భారతి పేరు మీద ఇంటి పన్ను రశీదు ఇవ్వడంతో కబ్జాదారుడు స్థలాన్ని రిజిస్టర్‌ చేయించుకున్నాడనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఎంపీడీఓ సుమిత్రమ్మను, ముచ్చుమర్రి వెటర్నరీ వైద్యులు రాగసంధ్యను వివరణ కోరగా పునరావాస గ్రామాల కింద డెయిరీ నిర్మించారు. ఆ భవనాన్ని పశుసంవర్ధక శాఖకు రిజిస్టర్‌ చేయించలేదని చెప్పడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement