● ఇద్దరిపై కేసు నమోదు
గోనెగండ్ల: మండల కేంద్రంలోని లక్ష్మిపేటకు చెందిన కురువ రంగడు అలియాస్ రంగముని (40) బుధవారం పొలం వద్ద జరిగిన ఘర్షణలో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. లక్ష్మిపేటకు చెందిన రంగడు, అతని సోదరుడు వెంకటేష్ బుధవారం ఉదయం ఐరన్‌బండ గ్రామ సమీపంలోని తమ పొలంలో ఎరువు మందు చల్లేందుకు రస్తాలో పట్ట వేసి మందు కలుపుతున్నారు. అదే రస్తాలో భానుచంద్ర, వెంకట్రాముడు బైక్‌పై పట్ట మీదుగా వెళ్లడంతో పట్ట బైకుకు తట్టుకొని చిరిగిపోయి ఎరువుల మందు కిందపడింది. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి లోనైన భానుచంద్ర పొలంలో ఉన్న ఇనుప చలికెతో రంగడు ఎదపై బలంగా కొట్టాడు. తీవ్ర నొప్పితో రంగడు ఇంటికి చేరుకున్నాడు. వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఎమ్మిగనూరుకు తీసుకెళుతుడగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. దీంతో ఆగ్రహానికి లోనైన కుటుంబ సభ్యులు, బంధువులు రంగడు మృతదేహంతో సాయంత్రం గోనెగండ్లలోని వైఎస్సార్ సర్కిల్‌లో రోడ్డుపై ధర్నా చేపట్టారు. హత్య చేసిన వారిని తమ ముందు ఉంచి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. సీఐ చంద్రబాబు, పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకొని వారిని శాంతింపజేశారు. దీంతో మృతదేహాన్ని తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భానుచంద్ర, వెంకట్రాముడుపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


