నంద్యాల(న్యూటౌన్): పర్యాటక ప్రాంతాల విశిష్టతను విస్తృతంగా ప్రచారం చేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. యాగంటి, అహోబిలంలో రోప్‌వే ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లా లోని శ్రీశైలం, మహానంది, యాగంటి తదితర ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల విశిష్టతను విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. పర్యాటక ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా మార్చే బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి సునీల్ కన్నా మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెలుం గుహలతో పాటు బిల్లసర్గం గుహలు, వాల్మీకి గుహలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయన్నా రు. అహోబిలం ప్రాంతం సాహస పర్యాటకానికి కూడా అనుకూలంగా ఉందన్నారు. జిల్లాలోని ఇతర ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా పర్యాటక మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్, లఘుచిత్రాల తదితర పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను జేసీ అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి శివారెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


