● ఐదేళ్లుగా నిలిచిపోయిన స్వామి వరపూజ ● పూజ పునఃప్రారంభం కోసం భక్తుల ఎదురు చూపులు
బేతంచెర్ల: ఉమ్మడి జిల్లాలో వైష్ణవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఆర్‌ఎస్ రంగాపురం శివారులో వెలసిన శ్రీ మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులు ఎంతో విశ్వాసంతో నిర్వహించే వరపూజ ఐదేళ్లుగా నిలిచిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, చైన్నె ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లిస్తుంటారు. స్వామి వారు వరప్రదాతగా ప్రసిద్ధి చెందడంతో వరపూజకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ పూజలో పూలు రాలి కిందపడితే తమ కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ప్రతి శనివారం వేకువజామున నిర్వహించే ఈ వరపూజను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే 2021 మే 31న ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా బాలాలయం ఏర్పాటు చేసినప్పటి నుంచి వరపూజ నిలిచిపోయింది. అనంతరం 2023 జూన్ 8న రూ.3.90 కోట్లతో పునర్నిర్మించిన విమాన గోపురం, ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించి, స్వయంభు మూలమూర్తికి పూజలు ప్రారంభించారు. అయితే ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తై పూజలు కొనసాగుతున్నప్పటికీ భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న వరపూజను మాత్రం తిరిగి ప్రారంభించకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఆలయ అధికారులు స్పందించి భక్తుల విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని వరపూజను పునఃప్రారంభించాలని కోరుతున్నారు. దీనికితోడు ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రతి శుక్రవారం చేసే తిరుచ్చి మహోత్సవం, జిల్లాలో అహోబిలం నరసింహ స్వామి ఆలయం తరువాత ప్రతి నెలలో ఒకసారి నిర్వహించే స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం వేడుకలను ఆలయానికి మాత్రమే పరిమితం చేస్తూ ప్రసార మాధ్యమాలకు అనుమతి ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా సందర్భాల్లో ఆలయ పూజారులు, భక్తులే ఈ వేడుకల్లో పాల్గొంటుండగా అధికారులు మాకు తీరిక లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా ఆలయంలో జరిగే ఉత్సవాలకు ప్రచారం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులును వివరణ కోరగా శాస్త్ర ప్రకారం ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన తరువాత వరపూజ ప్రారంభిస్తామని చెప్పారు.


