బనగానపల్లె:
మండలంలోని కాపులపల్లి గ్రామానికి చెందిన బి.రామలక్ష్మమ్మ (42) గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది బుధవారం అర్ధరాత్రి సమయంలో పేడరంగు ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ గురువారం తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో విష ద్రావణం తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు సీఐ తెలిపారు. భర్త నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతురాలికి ఇద్దరు సంతాపం ఉన్నారు.
జాతీయ స్విమ్మింగ్ జట్టులో చోటు
నంద్యాల(అర్బన్): జాతీయ మాస్టర్స్ స్విమ్మింగ్ జట్టులో స్థానం సాధించినట్లు నంద్యాలకు చెందిన ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు హర్యానాలోని బహదూర్ ఘడ్‌లో జరిగిన జాతీయ పోటీల్లో పాల్గొని రెండు ఈవెంట్లలో ఏడవ స్థానంలో నిలిచానన్నారు. పట్టణంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారులకు జాతీయ జట్టులో అవకాశం కల్పిస్తూ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుందన్నారు.ఆగస్టులో జరిగిన ఏపీ మాస్టర్స్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణ పతకాలు సాధించడంతో జాతీయ జట్టులో చోటు దక్కిందన్నారు. అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు బెంగుళూరులో జరగనున్న రెండవ ఆసియన్ మాస్టర్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున పాల్గొనేందుకు ఎంపికయ్యానని,ఈ పోటీల్లో 53 ఆసియా దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. స్విమ్మింగ్‌లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్న ప్రభాకర్‌రెడ్డిని పలువురు అభినందించారు.


