రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అంగన్‌వాడీలకు చీరల సరఫరా చేసే భారీ టెండర్ వేరే ఎవ్వరికీ ఇవ్వకుండా ఒకే ఒక్క ‘పచ్చ’కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం వెనుక పెద్ద బాగోతమే నడిచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ పార్టీ రంగు అయిన పసుపు రంగు ప్రదర్శించుకోవాలనే తాపత్రయం తప్ప వస్త్రం నాణ్యతపైనా, పరిమాణంపై కనీస శ్రద్ధ తీసుకోలేదు. మూడేళ్ల క్రితం అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కార్యకర్తలకు, ఆయాలకు ఒక్కొక్కరికి ఒకేసారి ఆరు చీరలు, ఆరు జాకెట్లు అందజేశారు. వాటిని చూసిన అంగన్‌వాడీలో ఒక్కమాట కూడా మాట్లాడకుండా సంతోషంగా తీసుకుని కట్టుకున్నారు. నేటికి అనేక మంది వాటినే కట్టుకుంటు ఉండటం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలకు ఒక్కొక్కరికి రెండు చీరలు మాత్రమే రంగు డిజైన్ మార్చేసి సరఫరా చేశారు. కార్యకర్తలకు పచ్చ రంగు చీర, ఆయాలకు ఎర్ర రంగు చీర అందజేశారు. గత ప్రభుత్వంలో అందజేసిన చీరలతో పోలిస్తే నాణ్యత నాసిరకంగా ఉందని, కొలతల్లో చాలా తేడా ఉందని అంగన్‌వాడీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అందించిన చీర కొలత 5.5 మీటర్లు ఉండగా ప్రస్తుతం అందించిన చీర కొలత 4.5 మీటర్ల ఉన్నట్లు తెలుస్తోంది. చాలీచాలని చీరలను కట్టుకుని ఏవిధంగా విధులకు హాజరు కావాలని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


