పులికోటలో అలజడి | - | Sakshi
Sakshi News home page

పులికోటలో అలజడి

Aug 4 2026 1:35 AM | Updated on Aug 4 2026 1:35 AM

పర్యవేక్షణ మరింత వేగవంతం చేశాం

ఎన్‌ఎస్‌టీఆర్‌లో వరుసగా

పులుల మరణాలు

పర్యవేక్షణ లోపం, సిబ్బంది కొరతనే

కారణమా?

ఆత్మకూరురూరల్‌: పులుల సంరక్షణకు దుర్గమైన నాగార్జున సాగర్‌ – శ్రీశైలం పులుల అభయారణ్యం (ఎన్‌ఎస్‌టీఆర్‌)లో అలజడి రేగింది. అంతర్జాతీయ పులుల దినోత్సవం రోజున ఒక పులి, ఆ మరుసటి రోజు మరొక పులి మృతి చెందింది. ఇవి రెండు కూడా ఆడపులులే కావడం అత్యంత విచారకరం. ఒక్కో ఆడపులి తన జీవిత కాలంలో సుమారు 25 పులులకు జన్మనిస్తుంది. అందువల్ల పులుల ప్రవర్దనానికి ఈ మరణాలు ఎంతో విఘాతం. ఎన్‌ఎస్‌టీఆర్‌ పరిధిలో ప్రస్తుతం 87 పులులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మూడేళ్లలో వివిధ కారణాలతో పలు పులుల మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో నాలుగు పులులు వేటగాళ్ల ఉచ్చులకే మరణించడం విషాదకరం. మరి కొన్ని పులులు స్థావరంపై ఆధిపత్యం, సంభోగ సమయంలో జరిగిన పోరాటాల్లో మరణించాయి. అలాగే ఎన్‌ఎస్‌టీఆర్‌ మీదుగా వెళ్లే రహదారుల్లో వాహనాలు ఢీకొని, రైల్యే ట్రాక్‌ వల్ల కూడా పులులు మరణిస్తున్నాయి. కారణాలు ఏవైనా పులికోటలో భద్రతా గాలిలో దీపంలా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

లోపాలు ఎన్నో..

● అత్యంత ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న నాగార్జునసాగర్‌ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం (ఎన్‌ఎస్‌టీఆర్‌)లో ఎప్పటివో బ్రిటీష్‌ కాలం నాటి రేంజ్‌లే ఇంకా కొనసాగుతున్నాయి.

● పెద్ద విస్తీర్ణంలో ఉన్న రేంజ్‌లలో ఫుట్‌ పెట్రోలింగ్‌ చేస్తూ తిరగడం అటవీ సిబ్బందికి కష్టసాధ్యంగా మారింది.

● బేస్‌ క్యాంప్‌లో ఉండే ప్రొటెక్షన్‌ వాచర్ల సహకారంతో ఎలాగోలా నడిపిస్తున్నారే కానీ.. శాసీ్త్రయంగా పర్యవేక్షించడం సాధ్యం కావడం లేదు.

● అటవీ విస్తీర్ణంలో ఉండాల్సిన సిబ్బందిలో ప్రస్తుతం అభయారణ్యం పరిధిలో కేవలం 30 శాతం సిబ్బంది మాత్రం ఉండటంతో వేటగాళ్లపై నిఘా కొరవడుతోంది.

● కొత్త రిక్రూట్‌మెంట్లు లేక పోవడంతో అధికార, సిబ్బంది కొరత వేధిస్తోంది.

● ఈ అభయారణ్యానికి వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెక్షన్‌లో శిక్షణ ఉన్న అధికారులను కాకుండా టెరిటోరియ ల్‌, ఎర్రచందనం ప్రాంతాల నుంచి రిటైర్డ్‌మెంట్‌కు సమీపంలో ఉన్న అధికారులను బదిలీ చేయడంతో పులి సంరక్షణ చర్యలు కార్యాలయాలకే పరిమితమవుతున్నాయి.

● ప్రతిష్టాకరమైన ఎన్‌ఎస్‌టీఆర్‌లోని నాలుగు డివిజన్‌లను సమన్వయం చేయాల్సిన ఫీల్డ్‌ డైరెక్టర్‌లను తరచూ రాజకీయ కారణాలతో బదిలీలు చేస్తుండడం పులి సంరక్షణలో అతి పెద్ద లోపంగా కనపడుతోంది.

నేడు హైపవర్డ్‌ కమిటీ పర్యటన..

వరుసగా పులుల మరణాలతో ప్రభుత్వం మొద్దు నిద్ర వీడినట్లుగా కనిపిస్తోంది. ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులుల సంరక్షణపై అధ్యయనం చేసి తగు సూచనలు ఇచ్చేందుకు ఒక హైపవర్డ్‌ కమిటీని నియమించింది. అటవీ శాఖ ముఖ్య సలహాదారు మల్లికార్జునరావు, అడిషనల్‌ పీసీసీఎఫ్‌ రాహుల్‌ పాండే, డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ సభ్యుడు రాజశేఖర్‌, హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేటివ్‌ సొసైటీకి చెందిన ఇమ్రాన్‌ సిద్దిఖి, వన్యప్రాణి శాస్త్రవేత్త నవీన్‌ కుమార్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ మంగళవారం నుంచి ఎన్‌ఎస్‌టీఆర్‌లో పర్యటించనుంది.

పులుల మరణం తరువాత ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలలో ఫుటేజ్‌లను అధ్యయనం చేశాం. క్యాటిల్‌ కిల్లింగ్‌ కేసులు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించాం. అక్రమంగా అడవుల్లోకి ఎవరైనా వచ్చారా అన్న విషయాలపై కూడా దర్యాప్తు చేస్తున్నాం. హైపవర్డ్‌ కమిటీకి మా దర్యాప్తు వివరాలు అన్ని అందజేస్తాం.

– విగ్నేష్‌ అపావ్‌, డీడీపీటీ, ఆత్మకూరు

అనుమానితులపై ఆరా?

మహానంది: గిద్దలూరు డివిజన్‌లోని రాచర్ల బీట్‌లో పెద్దపులి మృతి చెందిన విషయం తెలిసిందే. గత నెల 31న అంబచెరువు, తట్టేమడుగు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కళేబరం కనిపించింది. దర్యాప్తులో భాగంగా రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలి సింది. కాగా పుల్లలచెరువుకు చెందిన ఒకరు మహానంది ఈశ్వర్‌నగర్‌ కాలనీకి వచ్చి ఉంటున్నాడని, అతని వద్ద పులి గోర్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో మార్కాపురం, నంద్యాల అటవీశాఖ అధికారులు మహానందికి చేరుకుని అతని కోసం గాలించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement