నంద్యాల(న్యూటౌన్): 2026–27 విద్యాసంవత్సరానికి పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శైలేంద్రకుమార్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పాలిసెట్ – 2026 స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమో కోర్సుల్లో 15 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ సీట్ల భర్తీ కోసం ఈనెల 5వ తేదీన రిజర్వేషన్ పాటిస్తూ స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ చేపడుతున్నామన్నారు. విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ దరఖాస్తు ఫారాన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో 4వ తేదీన సాయంత్రం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో అందజేయాలన్నారు. పాలిసెట్‌లో క్వాలిఫై అయి ఏ కళాశాలలో సీటు రాని విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. వివరాల కోసం 9849651891, 9966228745ను సంప్రదించాలన్నారు.
శాస్త్రోక్తంగా సహస్రదీపార్చన సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రమైన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లకు సోమవారం దేవస్థానం సహస్రదీపార్చన సేవను నిర్వహించింది. ముందుగా దేవాలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో సహస్రదీపార్చన పూజలు చేపట్టారు. ఈ సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై ఉంచి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రూ. 10 వేల జరిమానా
డోన్ రూరల్: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి కోర్టు రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. ఇమామ్ బాషా, ఈడిగ మధు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడగా పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచారు. డోన్ స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరుల్లా ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సీఐ రాకేష్, ఎస్‌ఐ మమత హెచ్చరించారు.
మహానంది ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా మౌళీశ్వరరెడ్డి
మహానంది: మహానంది దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా నరాల చంద్రమౌళీశ్వరరెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడితో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేపట్టారు.
టీచర్‌పై కేసు నమోదు
బండిఆత్మకూరు: మండలంలోని ఈర్నపాడు గ్రామంలోని నరేంద్ర మెమోరియల్ స్కూల్‌లో 2వ తరగతి చదువుతున్న విద్యార్థిని దివ్యను కర్రతో కొట్టిన ఘటనపై ఉపాధ్యాయురాలు మౌనికపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జగన్‌మోహన్ సోమవారం తెలిపారు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన బాలిక తండ్రి కొండయ్య ఫిర్యాదు మేరకు టీచర్ మౌనికపై కేసు నమోదు చేశామని చెప్పారు. పాఠశాలలో జరిగిన సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
పీజీఆర్‌ఎస్‌కు 149 ఫిర్యాదులు
బొమ్మలసత్రం: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 149 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ప్రతి ఫిర్యాదుతో స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యల జాప్యంపై ఆయా స్టేషన్ అధికారులను విచారించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదులు తిరిగి పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.


