విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

బేతంచెర్ల: గ్రామ సచివాలయాల్లో సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్‌ కొత్తపల్లె గ్రామ సచివాలయాన్ని గురువారం ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ సచివాలయ సిబ్బంది ఆన్‌లైన్‌ హాజరు నమోదును పరిశీలించారు. విధులకు హాజరుకాని పంచాయతీ గ్రేడ్‌–5 సిబ్బంది, వీఆర్వోపై షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. గ్రామ సచివాలయంలో రిజిష్టర్లను పరిశీలించి ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. రీ సర్వేకు సంబంధించి వీఆర్వో, సర్వేయర్‌ అందుబాటులో లేరని రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకరాగా, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మెరుగైన వైద్య సేవలు అందించాలి

గోస్పాడు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ ఆదేశించారు. గోస్పాడు పీహెచ్‌సీని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఆరోగ్య పరీక్షల కోసం వచ్చిన గర్భవతులతో మాట్లాడారు. రక్తహీనత సమస్య తలెత్తకుండా సమయానికి మంచి పోషకాహారం తీసుకోవాలని, క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జూలేపల్లి గ్రామంలో సంచారచికిత్స కార్యక్రమాన్ని పరిశీలించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఎన్‌సీడీ సర్వేని వేగవంతం చేయాలన్నారు. క్యాన్సర్‌ వ్యాధి నివారణకు ఇస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ 14 సంవత్సరాల బాలికలందరికీ అందేలా చూడాలన్నారు. ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలు సక్రమంగా అందుతున్నయా లేదా అనే విషయంపై రోగులతో ఆరా తీశారు. స్థానిక వైద్యాధికారులు డాక్టర్‌ కాంతారావు నాయక్‌, డాక్టర్‌ షబ్బీర్‌ హుస్సేన్‌ వలి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో జిల్లా నాయకులకు పదవులు

బొమ్మలసత్రం: జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులకు వివిధ విభాగాలకు సంబంధించి పదవులను కల్పించారు. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల నియోజకవర్గానికి చెందిన ఎం.శివనాగిరెడ్డిని స్టేట్‌ ఎంప్లాయీస్‌, పెన్షనర్స్‌ విభాగం జాయింట్‌ సెక్రటరీగా నియమించారు. ఎస్‌వీఎన్‌వీ ప్రసాదరెడ్డిని నంద్యాల జిల్లా ఎంప్లాయ్‌, పెన్షనర్స్‌ విభాగం అధ్యక్షుడిగా నియమించారు. పాణ్యానికి చెందిన కాల్వ లక్ష్మిపతిని రాష్ట్ర పబ్లిక్‌ వింగ్‌ సెక్రటరీగా, పొంగులేటి సుభాషిణిరెడ్డిని స్టేట్‌ అంగన్‌వాడీ వింగ్‌ సెక్రటరీగా, యాతా సురేష్‌ను స్టేట్‌ క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ జాయింట్‌ సెక్రటరీగా నియమించారు. బనగానపల్లెకు చెందిన అందె శ్రీనివాసరెడ్డి, పోరెడ్డి మనోహర్‌రెడ్డిలను స్టేట్‌ రైతు విభాగం జాయింట్‌ సెక్రటరీగా, నందికొట్కూరుకు చెందిన వి.రామకృష్ణారెడ్డిని నియోజకవర్గ ఎంప్లాయీస్‌, పెన్షనర్స్‌ విభాగం అధ్యక్షులుగా నియమించారు.

నిప్పుల కొలిమి

దొర్నిపాడులో

42.9 డిగ్రీల ఉష్ణోగ్రత

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గురువారం ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. దొర్నిపాడులో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. గోస్పాడులో 42.8, ఆళ్లగడ్డలో 42.7, రుద్రవరంలో 42.6, చాగలమర్రిలో 42.3, నంద్యాల రూరల్‌లో 42.3, అవుకులో 42.2, బనగానపల్లిలో 42.2, కౌతాలంలో 41.6, మంత్రాలయంలో 41.5 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్న సమయంలో గాలిలో తేమ 10 శాతానికి పడిపోతుండటంతో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement