నంద్యాల జిల్లాలో మొక్కజొన్న సాగు వివరాలు..(ఎకరాల్లో)
విస్తీర్ణం విస్తీర్ణం
నేను 11 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. ఎకరాకు రూ. 40 వేల వరకు పెట్టుబడులు పెట్టాను. పంట దిగుబడి చూస్తే ఏం మిగిలేలా లేదు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయడం లేదు. మేము కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాం. ఇప్పటికై నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటా రూ.2,400 మద్దతు ధరతో కొనుగోలు చేయాలి
–భూపాల్ రెడ్డి, మొక్కజొన్న రైతు, ఆకుమల్ల గ్రామం,సంజామల మండలం
గతేడాదిలాగే ఏడాది కూడా మొక్కజొన్న కలిసి రాలేదు. ఈ రబీలో 6 ఎకరాల్లో పంట వేశాను. దిగుబడి ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు వచ్చింది. అయితే, మద్దతు ధర లభించడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో వ్యాపారులు ధర తగ్గించి అడుగుతున్నారు. క్వింటా రూ. 1750లోపే పలుకుతుంది.
– పేరం వెంకటేశర్ రెడ్డి, మొక్కజొన్న రైతు, ఆకుమల్ల గ్రామం, సంజామల మండలం
సంజామల: గత రెండేళ్లుగా రైతులకు వ్యవసాయం కలిసి రావడం లేదు. అతివృష్టి, అనావృష్టికి తోడు ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో నష్టాలు మూటగట్టుకుంటున్నారు. మొక్కజొన్న రైతుల పరిస్థితి మరీ దయనీయం. కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేక, దళారులు అడిగిన ధరకు విక్రయించలేక సతమతమవుతున్నారు. మరికొందరు ఆర్థిక పరిస్థితి సహకరించక, నిల్వ చేసుకునే సదుపాయం లేక వ్యాపారులు అడిగిన ధరకే విక్రయిస్తున్నారు. ఖరీఫ్ కలిసి రాలేదు. కనీసం రబీ సీజనైనా తమకు నష్టాల నుంచి గట్టెక్కిస్తుందేమోననే ఆశతో నంద్యాల జిల్లాలో భారీగా మొక్కజొన్న సాగు చేశారు. సాధారణ విస్తీర్ణం 29,713 ఎకరాలు కాగా రికార్డు స్థాయిలో 72, 896 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. జిల్లాలో పాములపాడు, బనగానపల్లె, రుద్రవరం, చాగలమర్రి, ఆళ్లగడ్డ మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేశారు.
‘మద్దతు’ ప్రకటనలకే పరిమితం
విత్తు నుంచి కోత వరకు ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ. 45 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. దిగుబడి 30 నుంచి 35 క్వింటాళ్లు వస్తుంది. ప్రభుత్వం మద్దతు ధర రూ. 2,400గా ప్రకటించి జిల్లాలో ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో చేతికొచ్చిన దిగుబడిని ఎక్కడ విక్రయించుకోవాలో అర్థం కావడం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ వ్యాపారులు, దళారులు ధర తగ్గించి అడుగుతున్నారు. నాణ్యతను బట్టి క్వింటం రూ. 1500 నుంచి రూ. 1750కు మించి కొనుగోలు చేయడం లేదు. ఈ ధరకు విక్రయిస్తే కష్టమంతా పెట్టుబడులకే సరిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పంట చేతికి రాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకునేవారని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మొక్కజొన్న రైతులు కోరుతున్నారు.
నియోజకవర్గం సాధారణ సాగు
నందికొట్కూరు 5957 20095
ఆళ్లగడ్డ 11176 19957
బనగానపల్లె 6394 17102
శ్రీశైలం 2445 7160
డోన్ 997 2067
నంద్యాల 568 1689
పాణ్యం 2176 4826
మొత్తం 29,713 72,896
ప్రకటనకే పరిమితమైన మద్దతు ధర
జిల్లాలో ఎక్కడా కానరాని
కొనుగోలు కేంద్రాలు
సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
ప్రభుత్వ తీరుతో నష్టపోతున్న రైతులు


