నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఈనెల 10న సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించి తెలుసుకో వచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.
రేషన్ బియ్యం స్వాధీనం
మహానంది: నంద్యాల–గిద్దలూరు రహదారిలోని బోయలకుంట్ల మెట్ట వద్ద నంద్యా ల సివిల్ సప్లై అధికారులు ఆదివారం రేషన్ బియ్యంతో వెళ్తున్న లారీని పట్టుకున్నారు. రేషన్ బియ్యం మార్కాపురం నుంచి నంద్యాల వైపు వస్తుండగా జేసీకి సమాచారం అందింది. ఈ మేరకు జేసీ ఆదేశాలతో సివిల్ సప్లై ఏఎస్‌ఓ రవిబాబు, సిబ్బంది దాడి చేసి లారీని పట్టుకున్నారు. లారీని తనిఖీ చేయగా 130 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉండటంతో అధికారులు నంద్యాల తాలూకా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి సివిల్ సప్లయ్ గోడౌన్‌కు తరలించారు.
నంద్యాల(న్యూటౌన్): 2011 కంటే ముందు నియమించిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కరుణా నిధి మూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పీఆర్‌టీయూ కార్యాలయంలో అధ్యక్షుడు రామపక్కీర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్‌బాషా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీపీఎస్‌ను రద్దు చేయించి పాత పెన్షన్ వర్తింపజేయాలన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించి పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు పర్యవేక్షణ పోస్టులు అయిన ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ, డైట్ లెక్చరర్ పోస్టులలో పదోన్నతి పొందడానికి అవకాశం కల్పించాలన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా ప్రతి పాఠశాలకు కనీసం ఇద్దరిని కేటాయించాలన్నారు. సమావేశంలో పీఆర్‌టీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కరరెడ్డి, రాష్ట్ర నాయకులు కృష్ణారావు, విజయరావు, నూర్‌మహమ్మద్, రమణయ్య పాల్గొన్నారు.


