‘ప్రజా ఉద్యమం’లో భాగస్వాములుకండి
● ప్రభుత్వ మెడికల్ కళాశాలల
ప్రైవేటీకరణను అడ్డుకుందాం
● 12న నంద్యాలలో నిరసన ర్యాలీ
● ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా
నంద్యాల: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘ప్రజా ఉద్యమం’లో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూటమి ప్రభు త్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని ఈనెల 12వ తేదీన చేపట్టనున్న ప్రజా ఉద్యమ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, వైఎస్సార్‌సీపీ నేతలు ప్రజా ఉద్యమం పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప సంకల్పంతో 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుట్టారన్నారు. తొలి దశలో ఐదు మెడికల్ కళాశాలలను దిగ్విజయంగా ప్రారంభించారన్నారు. మిగతా కళాశాలలను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాల్సిన సీఎం చంద్రబాబు దురాలోచనలతో వాటిని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర పన్నా రన్నారు. పీపీపీ విధానం వెనుక బాబు బినామీలు ఉన్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు.


