
అభివృద్ధి పేరుతో అప్పులు చేస్తున్నారు!
● వామపక్ష నాయకుల ఆందోళన
నంద్యాల(న్యూటౌన్): రాష్ట్ర అభివృద్ధి పేరుతో కూటమి నేతలు విపరీత అప్పులు చేస్తున్నారని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. ఎలాంటి అభివృద్ధి లేకున్నా వేల కోట్ల రూపాయలు అప్పులు ఎలా తీసుకు వస్తారని ప్రశ్నించారు. నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్ ఆర్చి నుంచి గాంధీచౌక్ వరకు సీపీఐ, సీపీఎం న్యూడెమోక్రసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ‘మోదీ గో బ్యాక్’ అని నినాదాలు చేశారు. అనంతరం గాంధీచౌక్‌లో జరిగిన నిరసనలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా నిరసన చేస్తున్న వామపక్ష నాయకుల అక్రమ అరెస్ట్‌లకు పాల్పడటం శోచనీయమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. సిద్ధేశ్వరం అలుగు పూర్తి చేయాలని, శ్రీశైలానికి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జీఎస్‌టీ తగ్గిస్తున్నామంటూ సభలను నిర్వహించడం ప్రజలను పక్కదారి పట్టించడమేనన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు సోమన్న, డి శ్రీనివాసులు పాల్గొన్నారు.