
విధుల్లో అప్రమత్తంగా ఉండండి
● పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశం
కర్నూలు: ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటన నేపథ్యంలో బందోబస్తు విధుల్లో ఉండే పోలీసు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో అడిషనల్ డీజీ ఎన్. మధుసూదన్ రెడ్డి, ఐజీ శ్రీకాంత్, డీఐజీలు కోయ ప్రవీణ్, గోపీనాథ్ జెట్టి, సెంథిల్ కుమార్, సత్య ఏసుబాబు, ఫక్కీరప్ప కాగినెల్లిలతో కలసి పీఎం భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. మినిట్ టు మినిట్ ప్రోగ్రాం, రూట్ మ్యాప్, రాగమయూరి బహిరంగ సభ తదితర ప్రాంతాలను గూగుల్ జియో మ్యాప్‌ను తెరపై చూపిస్తూ డీజీపీకి ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరించారు. భద్రత చర్యలపై చర్చించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. బహిరంగ సభకు ఎక్కడినుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయనే విషయంపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. బహిరంగ సభ వద్ద మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీవీఐపీలు వెళ్లిపోయేవరకు ఎక్కడ కూడా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. డీఐజీలు, ఎస్పీలు, ట్రైనీ ఐపీఎస్‌లు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు సమావేశంలో పాల్గొన్నారు.
పటిష్ట బందోబస్తు
శ్రీశైలంటెంపుల్: ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా శ్రీశైలం వస్తున్న నేపథ్యంలో 1,800 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీశైలంలో ప్రత్యేక పూజల అనంతరం జగద్గురు పీఠాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని, ధ్యాన మందిరాన్ని సందర్శించి సున్నిపెంటకు వెళ్తారు. ప్రధాని శ్రీశైలం పర్యటనను పురస్కరించుకుని పోలీసులు బుధవారం ట్రయల్‌రన్ నిర్వహించారు.