చిప్పగిరి: వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మట్టి మిద్దె కూలి ఓ వృద్ధురాలు దుర్మరణం చెందింది. ఈ ఘటన నేమకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన శాంతమ్మ(85) ఇంట్లో ఒంటరిగా నివాసముంటోంది. బుధవారం రాత్రి మంచంపై నిద్రిస్తుండగా పైకప్పు కూలి ఆమైపె పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, తహసీల్దార్ ఇజాజ్ అహ్మద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వృద్ధురాలి మృతదేహాన్ని వెలికి తీయించి అంత్యక్రియలు చేయించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీరు ఉపాధి రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిర పడినట్లు గ్రామస్తులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
మహానంది: ఆంజనేయపురం సమీపంలోని తెలుగుగంగ కాలువ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందాడు. ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గాజులపల్లె గ్రామానికి చెందిన నరసింహులు(60) పొలం పనులకు వెళ్లి తెలుగుగంగ కాలువ వద్ద రోడ్డు దాటుతుండగా అబ్బీపురం గ్రామానికి చెందిన బాలవర్ధన్ రాజు ఆటోలో వెళ్తూ ఢీకొన్నాడు. విషయం తెలుసు కున్న ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి వెంటనే తన వాహనంలో వృద్ధుడిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి అంబులెన్స్ తర లించారు. అయితే కోలుకోలేక నరసింహులు మృతి చెందాడు. మృతుడి భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
బండి ఆత్మకూరు: ఎర్రగుంట్ల గ్రామ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పనూరు గ్రామానికి చెందిన ఎర్రద్దుల బ్రహ్మయ్య (33) అనే వ్యక్తి బుధవారం రాత్రి నంద్యాల వైపు బైక్‌పై వెళ్తుండగా.. ఎర్రగుంట్ల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మిదేవి, కూతురు, కుమారుడు ఉన్నారు. సమా చారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.