
లక్ష్యం దిశగా అడుగులేయాలి
● అంతర్జాతీయ క్రికెటర్ అంజలి శర్వాణి
ఆదోని సెంట్రల్: ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తే విజయం సొంతమవుతుందని అంతర్జాతీయ క్రికెటర్ అంజలి శర్వాణి సూచించారు. ఆరెకల్లు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో అంజలి శర్వాణి మాట్లాడుతూ తాను ఈ స్థాయికి రావడానికి గురువుల శిక్షణతో పాటు తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలన్నారు. క్రీడల పేరుతో చదువును నిర్లక్ష్యం చేయరాదన్నారు. అనంతరం అంజలి శర్వాణిని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమములో వ్యాయామ ఉపాధ్యాయుడు మహేంద్ర పాల్గొన్నారు.
గుర్తు తెలియని
వ్యక్తి మృతి
డోన్ టౌన్: పట్టణంలోని రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం–3పై గుర్తుతెలియని వ్యక్తి (36)మృతి చెందినట్లు రైల్వే ఎస్‌ఐ బిందుమాధవి మంగళవారం తెలిపారు. కొద్ది రోజులుగా రైల్వే స్టేషన్ చుట్టు పక్కల తిరిగుతండేవాడని, అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని ఎస్‌ఐ తెలిపారు. మృతుదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు. వివరాలు తెలిసిన వారు స్థానిక రైల్వే స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు.
యూరియా స్వాధీనం
హాలహర్వి: ఆస్పరి నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా ఆటోలో తరలుతున్న యూరియాను క్షేత్రగుడి చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి రశీదులు లేకపోవడంతో డ్రైవర్‌ను విచారిస్తున్నారు.

లక్ష్యం దిశగా అడుగులేయాలి