● రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి
● మరో కుమారుడి పరిస్థితి విషమం
ప్యాపిలి: బొలేరో వాహనం మృత్యువులా దూసుకొచ్చింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో తండ్రి విజయుడు (45), తనయుడు లక్ష్మీప్రసాద్ (25) మృతి చెందారు. మరో కుమారుడు రవి(10) పరిస్థ్థితి విషమంగా మారింది. ఈ దుర్ఘటన ప్యాపిలి మండలం పెద్దపొదిళ్ల సమీపంలో పెద్దమ్మ గుడి వద్ద బుధవారం చోటుచేసుకుంది. చిన్నపొదిళ్ల గ్రామానికి చెందిన విజయుడు, లక్ష్మిదేవి దంపతులతో పాటు వారి కుమారులు లక్ష్మీప్రసాద్, రవి ద్విచక్రవాహనాలపై ప్యాపిలి నుంచి లక్ష్మిదేవి సొంతూరు రంగాపురం వెళ్లేందుకు బయలుదేరారు. పెద్దమ్మ గుడి వద్దకు రాగానే వర్షం కురుస్తుండటంతో రోడ్డు పక్కన ద్విచక్రవాహనాలు ఆపుకుని ఉన్నారు. ఇదే సమయంలో ప్యాపిలి వైపు నుంచి వచ్చిన బొలేరో వాహనం ద్విచక్రవాహనాలపైకి దూసుకువచ్చింది. ప్రమాదంలో లక్ష్మీప్రసాద్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీదేవి, లక్ష్మీప్రసాద్, రవిలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కర్నూలులో చికిత్స పొందుతున్న విజయుడు కోలుకోలేక మృతి చెందాడు. పదేళ్ల వయస్సు ఉన్న రవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. విజయుడు వ్యవసాయకూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. లక్ష్మీప్రసాద్ ప్యాపిలిలో ఓ దుకాణంలో గుమాస్తాగా పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. ఈ యువకుడి పెళ్లి కాలేదు. తండ్రీకుమారులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో చిన్నపొదిళ్ల గ్రామంలో విషాదం అలముకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్యాపిలి పోలీసులు తెలిపారు.
విజయుడు, లక్ష్మీప్రసాద్ (ఫైల్)
దూసుకొచ్చిన మృత్యువు