
నలుగురు ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి అవార్డులు
నంద్యాల(న్యూటౌన్): రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు నంద్యాల జిల్లాకు చెందిన నలుగురు ఉపాధ్యాయులు ఎంపికై నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని పాములపాడు మండలంలోని కొత్త బానకచర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్‌ఎం షేక్ మగ్బుల్‌బాషా, నంద్యాల పట్టణంలోని నూనెపల్లె మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయుడు పి.వెంకటసుబ్బయ్య, పాణ్యం మండలం బలపనూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయుడు శేషఫణి, చాగలమర్రి మండలం జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మయ్యలు రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికై నట్లు తెలిపారు.
మ్యాథ్స్ ఉపాధ్యాయుడు..
నంద్యాల టెక్కె మున్సిపల్ హైస్కూల్‌లో పి.వెంకటసుబ్బయ్య 1991 నుంచి 1998 వరకు మ్యాథ్స్ ఉపాధ్యాయుడిగా పని చేశారు. అనంతరం 1998 నుంచి 2016 వరకు నంద్యాల పట్టణంలోని కేఎన్‌ఎం మున్సిపల్ హైస్కూల్‌లో 18 సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. అలాగే టెక్కె మున్సిపల్ హైస్కూల్‌లో 2016 నుంచి 2025 వరకు పని చేశారు. ఈ ఏడాది జూన్ నెలలో నూనెపల్లె మున్సిపల్ హైస్కూల్‌కు బదిలీ అయి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన సొంత గ్రామం కోవెలకుంట్ల మండలం బీజనవేముల కాగా తల్లిదండ్రులు సుబ్బరామయ్య, సిద్దమ్మలు.
తెలుగు పండిట్..
చాగలమర్రి: స్థానిక జిల్లా పరిషత్ (ఓరియంటల్) బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్ (స్కూల్ అసిస్టేంట్)గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మయ్య రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఎంపికయ్యారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కళాశాలలో గురువారం హాజరు కావల్సిందిగా తనకు సమాచారం అందినట్లు ఆయన తెలిపారు. ఈ అవార్డును ఈ నెల 5వ తేదీన విజయవాడలో అందుకోనున్నట్లు చెప్పారు.
ప్రధానోపాధ్యాయుడు..
పాములపాడు: కొత్తబానకచెర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న షేక్ మగ్బుల్ బాషా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను 1996 డిసెంబర్ 12న ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరానన్నారు. రాష్ట్ర అవార్డు తన బాధ్యతను పెంచిందన్నారు.

నలుగురు ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి అవార్డులు

నలుగురు ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి అవార్డులు