
ఏడి‘పింఛన్’
● ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ ఉత్తిదే ● సచివాలయాల వద్ద లబ్ధిదారుల పడిగాపులు
కోవెలకుంట్ల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ సచివాలయాలు, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో లబ్ధిదారులకు ఇళ్ల వద్దే పింఛన్లు అందజేస్తున్నామని గొప్పలు చెబుతోంది. కొన్నిచోట్ల ఆచరణలో అమలు చేయకపోవడంతో లబ్ధిదారులు పింఛన్ల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. కోవెలకుంట్ల మేజర్ పంచాయతీలో సెప్టెంబర్ నెల పింఛన్లు తీసుకునేందుకు లబ్ధిదారులు రెండవ రోజు మంగళవారం అవస్థలు పడాల్సి వచ్చింది. కొందరు సిబ్బంది తొలిరోజున ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకపోవడంతో రోజంతా ఎదురు చూసిన లబ్ధిదారులు.. మంగళవారం గ్రామ సచివాలయం వద్దకు చేరుకుని పడిగాపులు కాశారు. ఉదయం 10 గంటల తర్వాత సిబ్బంది గ్రామ సచివాలయంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయడంతో అక్కడి నుంచి ఇళ్లకు వెళ్లిపోయారు.