
రైతు సంక్షేమానికి ‘చంద్ర’గ్రహణం
● ఈనెల 9న అన్నదాతలతో
ఆందోళనలు, నిరసనలు
● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి
కర్నూలు (టౌన్): రాష్ట్రంలో రైతు సంక్షేమానికి ‘చంద్ర’గ్రహణం పట్టిందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. రైతుల గురించి ఏనాడైనా చంద్రబాబు ప్రభుత్వం ఆలోచించిందా అని ప్రశ్నించారు. కల్లూరు లోని తన స్వగృహంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. ఏడాదిన్నరలోపే కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. రైతులను టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు కేంద్రంతో కలుసుకొని రూ. 26 వేలు ఇస్తామని మొదటి సంవత్సరం ఎగ్గొటారన్నారు. ఇప్పుడు కేవలం రూ. 5 వేలు ఇచ్చారన్నారు. ఇది మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు.
యూరియా కోసం రైతుల పడిగాపులు
యూరియా కోసం రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోందని కాటసాని అన్నారు. రెండు నెలలైనా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోవడం దారుణమన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదన్నారు. తెలుగుదేశం నేతలే ఉద్దేశపూర్వకంగా యూరియాను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పొగాకు, మామిడి, మిర్చి, టమాటా, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర అందలేదన్నారు. రైతుల గోడు వినకుండా మద్యం, ఇసుక, మైనింగ్‌లలో టీడీపీ నేతలు బీజీగా ఉన్నారన్నారు.
9న ఆర్డీనో కార్యాలయాల వద్ద నిరసన
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడలేదని కాటసాని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందాయన్నారు. ధరల స్థిరీకరణ పేరుతో జగనన్న రూ. 3 వేల కోట్లు నిధి కేటాయించారని, ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏడాది రైతులను ఆదుకున్నారన్నారు. రైతులను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసే రోజులు వచ్చాయన్నారు. ఈనెల 9న జిల్లాలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద అన్నదాతలతో కలసి నిరసన తెలపుతామన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేస్తున్నట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలన్నారు. సమావేశంలో నగర పాలక డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, కార్పొరేటర్ నారాయణ రెడ్డి, శివారెడ్డి, పాటిల్ హనుమంతరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.