
శ్మశానం పేరిట కుంట పూడ్చి.. చేతులు కలిపి ఆక్రమింగేసి!
● నీటి కుంటను కబ్జా చేసిన టీడీపీ నేతలు
● అనుమానం రాకుండా
ప్రజలను మభ్యపెట్టి ఆక్రమణ
● చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
రుద్రవరం: కూటమి ప్రభుత్వంలో వాగులు, వంక లు, చెరువులు, కుంటలకు భద్రత లేకుండా పోతోంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు టీడీపీ నేతలు గద్దల్లా వాలుతున్నారు.అధికారుల అండదండలతో దర్జాగా కబ్జా చేసి సొంతం చేసుకుంటున్నారు. గ్రామ అవసరాల నిమిత్తం పూర్వం నుంచి ఉంటున్న నీటి కుంటను పూడ్చేసి పొలముగా మార్చినా అడిగే నాథుడే లేడు. టీడీపీ నేతలు ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మండలంలోని ఢీ.కొట్టాల నుంచి శ్రీరంగాపురం వేళ్లే దారి పక్కనే 226 సర్వే నంబరులో 7.50 ఎకరాల్లో ఓ కుంట ఉండేది. వర్షాకాలం నిండు కుండను తలపిస్తూ కళకలాడుతూ ఉండేది. ఆ కుంటలో నీరు నిల్వ ఉండటంతో పశువులు దాహం తీర్చుకునేందుకు, చుట్టు పక్కల ఉన్న వ్యవసాయ బోరు మోటర్లు రీచార్జ్ అయ్యేందుకు ఉపయోగ పడేది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆ కుంటను ఆక్రమించేందుకు ఢీ.కొట్టాలతో పాటు శ్రీరంగాపురం, ఎల్లావత్తుల గ్రామాల అధికార పార్టీకి చెందిన ఐదుగురు నాయకులు వేసిన పథకం పారింది.
ఓ ఉన్నతాధికారికి ముడుపులు?
నీటి కుంటను పూడ్చి పొలముగా మార్చడంలో ఓ ఉన్నతాధికారికి ముడుపులు అందాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నాయకుల ఆక్రమణలకు వంత పాడేందుకు లక్షల్లో తీసుకున్నారనే చర్చ జరు గుతోంది. గ్రామంలో కుంటను పూడ్చుతున్నారని గ్రా మస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకపోవడానికి ముడుపులే కారణమని తె లుస్తోంది. నీటికుంట ఆక్రమణపై ఆ గ్రామ వీఆర్వోను వివరణ కోరగా.. రెవెన్యూ రికార్డుల ప్రకారం అక్కడ కుంట ఉందన్నారు. ప్రస్తుతం అక్కడ ఆ కుంట ఆనవాళ్లు లేవని, కొంత స్థలంలో మట్టి తోలి చదును చేశారని, మిగిలినది అంతా పొలాలు అయ్యాయని చెబుతున్నారు.
డీకొట్టాల వద్ద కుంటలో కొద్ది స్థలంలో మట్టి తోలిన దృశ్యం
వరి సాగుకు మాగాణిగా మారిన కుంట

శ్మశానం పేరిట కుంట పూడ్చి.. చేతులు కలిపి ఆక్రమింగేసి!